Karnataka Polls: కావాలనే ఆలస్యం చేసిన జేడీఎస్.. కాంగ్రెస్, బీజేపీ నేతలే టార్గెట్

భారతీయ జనతా పార్టీలో మాజీ సీఎం షెట్టర్ తిరుగుబాటు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. తనకు టికెట్ రావడంపై ఆయనకే పెద్ద అనుమానం కలుగుతోంది. దీంతో సొంత పార్టీపై బహిరంగ విమర్శలకు దిగారు

Karnataka Elections 2023

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అటు అధికార భారతీయ జనతా పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. అయితే ఈ రెండు పార్టీలతో పాటు ప్రధాన పార్టీగా ఉన్న జనతాదళ్ సెక్యూలర్ (JDS) మాత్రం అభ్యర్థుల ప్రకటనలో కాస్త ఆలస్యంగా ఉంది. వాస్తవానికి జేడీఎస్ ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేసినట్లు తెలుస్తోంది. రెండు జాతీయ పార్టీల్లో ఇబ్బడిముబ్బడిగా నాయకులు ఉన్నారు. దీంతో చాలా మందికి టికెట్లు దొరకవని, అలాంటి నేతలను ఆకర్షించేందుకే జేడీఎస్ తమ అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యం చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Ambedkar statue: అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నాకు ఆహ్వానం రాలేదు: గవర్నర్ తమిళిసై

అయితే ఈ విషయంలో జేడీఎస్ సక్సెస్ కానున్నట్లే కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ నుంచి ఒక నేత, బీజేపీ నుంచి మరొక నేత జేడీఎస్ లో చేరారు. ఈ ఇద్దరు నేతలకు ఆయా పార్టీల్లో టికెట్లు దొరకలేదు. బగలకోట్ నుంచి టికెట్ ఆశించిన కాంగ్రెస్ నేత దేవరాజ్ పాటిల్, ఇక అకసికేరే నుంచి టికెట్ ఆశించిన బీజేపీ నేత, కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మైకి అత్యంత సన్నిహితుడైన ఎన్ఆర్ సంతోష్‭లకు సొంత పార్టీ నుంచి టికెట్లు దొరకలేదు. దీంతో వారు శనివారం మాజీ సీఎం కుమారస్వామి సమక్షంలో జేడీఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

Karnataka elections 2023: అభ్యర్థుల మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

ఇక దీనికి తోడు అధికార భారతీయ జనతా పార్టీలో మాజీ సీఎం షెట్టర్ తిరుగుబాటు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఢిల్లీకి వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. తనకు టికెట్ రావడంపై ఆయనకే పెద్ద అనుమానం కలుగుతోంది. దీంతో సొంత పార్టీపై బహిరంగ విమర్శలకు దిగారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోతే ఆ ప్రభావం 20 నుంచి 25 స్థానాలపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. బహుశా ఈయనకు టికెట్ రాకపోతే ఈయన కూడా జేడీఎస్ వైపుకు చూసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కారణం, కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సీట్ల పంపకం పూర్తికావచ్చింది. ఇక మిగిలింది జేడీఎస్ ఒక్కటే. పైగా ఆ పార్టీలోకి వెళ్తే తనతో పాటు తన వర్గంలోని కొంత మందికి కూడా టికెట్లు దొరికే అవకాశం ఉంది.

Karnataka Polls: బీజేపీ శైలికి వ్యతిరేకంగా యడియూరప్ప హాట్ కామెంట్స్.. వాటికి వ్యతిరేకమంటూ స్టేట్మెంట్

ఇలాంటి పరిణామాలన్నీ జేడీఎస్ ముందుగానే ఊహించిందట. అందుకే తమ అభ్యర్థులను ప్రకటించడంలో ఆలస్యం చేస్తోందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జేడీఎస్ ప్రయత్నాలు కొంత వరకు ఫలవంతంగానే కనిపించినప్పటికీ మరీ వాళ్లు ఆశించిన స్థాయిలో మాత్రం జరగడం లేదనే చెప్పొచ్చు. అయితే ఈ నెల చివరి నాటికి చర్చలు, చేరికలు, నామినేషన్లు పూర్తవ్వాలి. ఆ లోపు షట్టర్ లాంటి నాయకులు పార్టీలో చేరితే పార్టీకి మంచి మైలేజ్ దొరికినట్లే అంటున్నారు.

Karnataka Polls: అనుకున్నదే చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. మాజీ సీఎం సిద్దరామయ్యకు కోలార్ టికెట్ మిస్

224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రధాన విపక్షం కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే రాష్ట్రంలో మూడో పెద్ద పార్టీగా ఉన్న జేడీఎస్ ను అంత సులువుగా తీసుకోలేమని కూడా అంటున్నారు. గతంలో పలుమార్లు ఈ పార్టీ వల్ల కాంగ్రెస్, బీజేపీలు మెజారిటీని రాబట్టడంలో విఫలమయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు