10TV Edu Visionary 2025: 10టీవీని అభినందిస్తున్నాను.. సమసమాజ నిర్మాణం కావాలంటే విద్య ఒక్కటే మంత్రం: జయప్రకాశ్ నారాయణ
"ఈ మాటను బహిరంగంగా చెబుతున్నాను.. నేను సిగ్గుతో, బాధతో చెబుతున్నాను. హడావిడి, ఆర్భాటం తప్ప నిజమైన విద్యని పెంచే ప్రయత్నం జరగట్లేదు" అని చెప్పారు.

10TV Edu Visionary 2025
10TV Edu Visionary 2025: విద్యారంగంలో విశేషమైన సేవలందించిన వారిని 10టీవీ ఘనంగా సత్కరించింది. 10TV Edu Visionary 2025 పేరిట నిర్వహించిన ఈ ఈవెంట్‌కు లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ హాజరై మాట్లాడారు.
“10టీవీని అభినందిస్తున్నాను. విద్యకి బోలెడు అంత గిరాకి ఉంది మన దేశంలో. ఏ కులమైనా, ఏ మతమైనా ప్రాంతమైనా, డబ్బు ఉన్నా, లేకపోయినా, పల్లెటూరైనా, పట్టణమైనా.. పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని గొప్పవాళ్లు కావాలని కోరుకోని కుటుంబం ఈ దేశంలో లేదు. దానికోసం తల్లిదండ్రులు చేయని త్యాగాలు లేవు, పెట్టని ఖర్చు లేదు. అలాగే ప్రభుత్వాలు అపారంగా ఖర్చు పెడుతున్నాయి.
నిజాయితీగా చెబున్నాను మన పిల్లలకు తెలివితేటలు ఉన్నాయి. తల్లిదండ్రులు త్యాగాలు చేస్తారు.. ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. మంచి ప్రమాణాలతో విద్య కొద్దిమందికి మాత్రమే అందుతుంది. ఈ మాట నిష్కర్షగా మనం చెప్పాలి.. మనం జెబ్బలు తరుచుకుని బ్రహ్మాండంగా ఉన్నామని పొగుడుకుంటే లాభం లేదు.
మంచి ప్రమాణాలతో విద్య సమాజంలో అన్ని మార్పులకి కీలకం. ప్రతి బిడ్డ తను పుట్టిన నేపథ్యాన్ని అధిగమించి ఎదగాలి.. సంపద సృష్టిలో భాగస్వామి కావాలి. పేదరికం నుంచి బయట పడాలంటే విద్య ఒక్కటే మంత్రం.
అంటే బట్టి పట్టే విద్య కాదు.. కాపీ కొట్టే విద్య కాదు.. నిజమైన నైపుణ్యాన్ని ఇచ్చే విద్య.. ప్రతిభని వికసింపచేసే విద్య.. సంపదను సృష్టింపచేసే విద్య. సమాజంలో అసమానతలు తొలగాలి. పుట్టుకతో వచ్చిన వివక్ష పోవాలి, ఒక సమసమాజ నిర్మాణం కావాలంటే విద్య ఒక్కటే మంత్రం. మిగతా ఎన్ని కబుర్లు చెప్పిన కూడా పనికిరాదు.
స్వతంత్ర భారతంలో అతి పెద్ద వైఫల్యం ఏంటంటే విద్యలో భారతదేశం అధ్వాన స్థితిలో ఉంది. ఈ మాట బహిరంగంగా చెబుతున్నాను.. నేను సిగ్గుతో బాధతో చెబుతున్నాను. హడావిడి ఆర్భాటం తప్ప నిజమైన విద్యని పెంచే ప్రయత్నం జరగట్లేదు” అని చెప్పారు.