కరోనా నుంచి కోలుకున్న తబ్లిగీల కీలక నిర్ణయం, వారి కోసం ప్లాస్మా దానం

  • Publish Date - April 29, 2020 / 06:51 AM IST

దేశంలో కరోనా వైరస్‌ విస్తరణకు కారణమయ్యారనే అపవాదును ఎదుర్కొంటున్న తబ్లిగీ జమాత్ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై పడ్డ మచ్చను తొలగించుకునే పనిలో భాగంగా కరోనా రోగుల చికిత్సకు సాయం చేస్తున్నారు. కోవిడ్‌-19 నుంచి పూర్తిగా కోలుకున్న వారు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్లాస్మా థెరపీ ద్వారా వెంటిలేటర్‌పై ఉన్న రోగులు కూడా కోలుకున్న నేపథ్యంలో.. వారు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 200మంది తబ్లిగీలు ప్లాస్మా దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆదివారం(ఏప్రిల్ 26,2020) సాయంత్రం ఇఫ్తార్‌ ముగిశాక.. 10 మంది తబ్లిగీలు తమ ప్లాస్మాను దానం చేశారని, ఈ సేకరణకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ మహమ్మద్‌ షోయిబ్‌ వెల్లడించారు. కోవిడ్‌-19 నుంచి పూర్తిగా కోలుకున్న మరికొందరు తబ్లిగీలు కూడా తమ ప్లాస్మాను దానం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

రంజాన్ లో పుణ్యకార్యంగా ప్లాస్మా దానం:
కరోనా వైరస్ మహమ్మారి నుంచి బయటపడ్డ వారంతా తమ ప్లాస్మాను దానం చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, తబ్లిగీ జమాత్‌ చీఫ్‌ మౌలానా సాద్‌ వేర్వేరుగా పిలుపునిచ్చిన నేపథ్యంలో తబ్లిగీ జమాత్‌ సభ్యులు ప్లాస్మా దానానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్లాస్మాను డొనేట్ చేయడాన్ని పుణ్యకార్యంగా భావిస్తున్నారట. తమిళనాడులో తబ్లిగీ జమాతీలు రక్తం, ప్లాస్మాను దానం చేశారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇస్తే.. తామూ ప్లాస్మాను డొనేట్ చేస్తామని తబ్లిగి జమాతీ ప్రతినిధులు చెబుతున్నారు. తబ్లిగి జమాత్ ఏపీ, తెలంగాణ ఛాప్టర్ ప్రతినిధులు ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులను జరుపుతున్నట్లు సమాచారం.

ప్లాస్మా దానం చేసిన వారు తబ్లిగీలు కాదు:
దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లిగీలే కారణమని కేంద్ర మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ ఆరోపించారు. వైరస్‌ వ్యాప్తికి కారణమై వారు పాపం చేశారని అన్నారు. అలాంటి వారు ఇప్పుడు ప్లాస్మా దానం చేస్తూ.. తమను తాము ‘కరోనా వారియర్స్‌(వీరులు)’ అని చెప్పుకొంటరా? అని ప్రశ్నించారు. దేశభక్తులైన కొందరు ముస్లింలు ప్లాస్మాను దానం చేశారని, వారంతా తబ్లిగీలు కాదని మంత్రి అన్నారు.

దేశంలో కరోనా విస్తరణకు కారణం తబ్లిగీలు:
దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మార్చిలో జరిగిన తబ్లిగీ సదస్సు భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తబ్లిగీలో పాల్గొన్న ముస్లింలు దేశద్రోహులంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా వెలిశాయి. వారి వల్లే దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగాయని నిందించారు. ఈ నేపథ్యంలో తబ్లిగీ కారణంగా కరోనా సోకి అనంతరం కోలుకున్న 200 మంది ముస్లింలు, ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్న ఇతరులకు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు.

2వేల 300మందిలో 1,080 తబ్లిగీలకు కరోనా:
తబ్లిగీ జమాత్ సదస్సు తర్వాత లాక్ డౌన్ కారణంగా మర్కజ్ మసీదులో చిక్కుకుపోయిన 2వేల 300మందిని ఢిల్లీ ప్రభుత్వం అక్కడి నుంచి తరలించింది. వారందరిని క్వారంటైన్ కేంద్రాలకు పంపింది. మార్చి నెలఖారుకి వారిలో 1,080 మందికి కరోనా సోకినట్టు రిపోర్టుల్లో వచ్చింది. వారిలో 869మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్, అండ్ బిలియరీ సర్వీసెస్(ILBS) ప్లాస్మాను సేకరిస్తోంది. ఇప్పటికే 9మంది నుంచి ప్లాస్మాను సేకరించింది. మరికొందరి నుంచి ప్లాస్మా సేకరణకు సిద్ధమైంది.

జమాతే సదస్సు తర్వాత భారీగా పెరిగిన కరోనా కేసులు:
మార్చిలో మర్కజ్ మసీదులో నిర్వహించిన తబ్లిగీ జమాత్ సామూహిక ప్రార్థనల్లో పాల్గొని స్వస్థలాలకు తిరిగి వెళ్లిన వారి వల్ల దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగినట్లు వార్తలు వచ్చాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని బాహాటంగా వెల్లడించాయి. 70 శాతం మేర పాజిటివ్ కేసులు ఢిల్లీ సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారి వల్లే పెరిగాయని చెప్పాయి. ఈ పరిస్థితుల్లో తబ్లిగీలు తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది.