Delhi : చైనా, అమెరికా తర్వాత భారత్‌లోనే అత్యధిక క్యాన్సర్ కేసులు.. ఆందోళన కలిగిస్తున్న కేంద్ర గణాంకాలు

చైనా, అమెరికా తర్వాత భారత్‌లో క్యాన్సర్ కేసులు అత్యధికంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. వీటిలో నోటి, బ్రెస్ట్ క్యాన్సర్లు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

Delhi : భారత్‌లో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. చైనా, అమెరికా తర్వాత క్యాన్సర్ కేసులు భారత్‌లో అధికంగా ఉన్నాయని తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచ దేశాలైన అమెరికా, చైనాలలో క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయి. ఆ దేశాల తర్వాత స్ధానంలో భారత్ నిలిచింది. 2022 లో 14.61 లక్షల కేసులు ఉండగా.. 2015 నాటికి ఈ సంఖ్య 15.7 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా.మన్సుఖ్ మాండవియా పార్లమెంటులో ఈ వివరాలను వెల్లడించారు. ఈ కేసుల్లో అత్యధికంగా నోటి, బ్రెస్ట్ క్యాన్సర్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ (2,10,958), మహారాష్ట్ర (1,21,717), పశ్చిమ బెంగాల్ (1,13,581), బీహార్ (1,09,274), తమిళనాడు (93,536) రాష్ట్రాల్లో క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

Breast Cancer : యువతులలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ? నిర్ధారణ, చికిత్స

కాగా క్యాన్సర్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తీసుకునే చర్యలపై లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవియా సమాధానం ఇచ్చారు.  క్యాన్సర్ చికిత్స కోసం కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సాంకేతిక, ఆర్ధిక సాయం అందిస్తోందని  చెప్పారు. పలు రాష్ట్రాల్లో తగిన వైద్య సిబ్బందిని నియమించడం, రోగులకు మౌలిక వసతులు కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 30 సంవత్సరాలు దాటిన వారికి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పథకం ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రారంభ దశలోనే నియంత్రించడం వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేస్తోందని వెల్లడించారు.

ఏపీలో కర్నూలు మెడికల్ కాలేజీలో స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్  ఏర్పాటుతో పాటు  గ్రామీణ స్థాయిలో క్యాన్సర్‌పై అవగాహన కల్గించే కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తున్నట్లు మంత్రి మాండవియా చెప్పారు. మంగళగిరి ఎయిమ్స్‌లో క్యాన్సర్ చికిత్సకు ఆమోదం లభించిందని వెల్లడించారు.

Gastric Cancer : కడుపులో ఇన్ఫెక్షన్ సమస్యలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కు దారితీస్తాయా ?

క్యాన్సర్ సోకడానికి వయసు, జన్యుపరమైన కారణాలు, రోగ నిరోధక వ్యవస్థ తక్కువగా ఉండటం వంటికి కారణాలు కావచ్చు. ఇంకా పొగాకు, మద్యపానం, అధిక బరువు, జీవనశైలి, ఇన్ఫెక్షన్లు శారీరక వ్యాయామం లేకపోవడం, వాయు కాలుష్యం వంటివి కూడా కారణం కావచ్చు. అత్యంత ప్రమాదకారిగా పొగాకు 14 రకాల క్యాన్సర్లకు కారణం అవుతోంది. మనదేశంలో క్యాన్సర్ కారకాల్లో 70% నివారించదగినవే. 40% పొగాకు కారణంగా, 20 శాతం ఇతర వ్యాధుల వల్ల, మరో 10% ఇతర కారణాల వల్ల క్యాన్సర్ సంభవిస్తోంది. అయితే క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించకపోవడం వల్ల క్యాన్సర్ మరణాలు ఎక్కువవుతున్నాయి. క్యాన్సర్ ముప్పును తగ్గించాలంటే లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశం ఉంటుంది. దేశంలో క్యాన్సర్ మరణాలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు