Brain Bleed Symptoms : ‘బ్రెయిన్ బ్లీడ్’ అంటే ఏంటి? సద్గురు ఈ పరిస్థితి నుంచి ఎలా కోలుకున్నారు? అసలు లక్షణాలేంటి? నివారణ ఎలా?

Brain Bleed Symptoms : బ్రెయిన్ బ్లీడింగ్ ఏంటి? ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంది. దీని తీవ్రతను ఎలా గుర్తించాలి? ఏయే లక్షణాలు ఉంటాయి అనే పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..

Brain Bleed Symptoms : ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ‘సద్గురు’ జగ్గీ వాసుదేవ్ తీవ్ర తలనొప్పితో మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయనకు ఎమ్ఆర్ఐ (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్) స్కానింగ్ చేయగా.. ఆయన మెదడులో తీవ్రరక్తస్రావం కనిపించింది. వెంటనే సద్గురుకు ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం సద్గురు బ్రెయిన్ సర్జరీ అనంతరం కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.

Read Also : Sadhguru Jaggi Vasudev : సద్గురుకు బ్రెయిన్‌లో బ్లీడింగ్‌.. ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో సర్జరీ.. ఇషా ఫౌండేషన్ ప్రకటన!

సద్గురుకు బ్రెయిన్ బ్లీడింగ్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఆయన బెడ్‌పై మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, సద్గురు బ్రెయిన్ బ్లీడింగ్ కారణాలేంటి? ఎలా జరిగి ఉండవచ్చు అనే ప్రశ్నలు చాలామందిలో వెల్లువెత్తాయి. అసలు బ్రెయిన్ బ్లీడింగ్ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? దీన్ని ఎలా గుర్తించాలి? ముందుగా నివారించడానికి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రెయిన్ బ్లీడింగ్ అంటే ఏమిటి? :
మెదడులో రక్తస్రావం జరగడాన్ని ఇంట్రాక్రానియల్ హెమరేజ్ అని కూడా పిలుస్తారు. మెదడు కణజాలం, పుర్రె మధ్య లేదా మెదడు కణజాలం లోపల ఇలా రక్తస్రావం జరగవచ్చు. ఇది ఒక రకమైన స్ట్రోక్ అని చెప్పవచ్చు. మెదడు, పుర్రె మధ్య రక్తం చేరిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ చేరకుండా నిరోధిస్తుంది. ఇది ప్రాణాంతకమైన పరిస్థితి. కొన్ని నిర్దిష్ట గంటల వ్యవధిలో చికిత్స తీసుకోవడం అవసరం. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఒకవైపు మెదడు రక్తస్రావం కలిగి వాపును కలిగిస్తుంది. మధ్యరేఖపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల మరోవైపు (మిడ్‌లైన్) మార్పు వస్తుంది.

ఫలితంగా మెదడు నిర్మాణాలు ప్రభావితమైన వైపు మాత్రమే కాకుండా మరోవైపు కూడా తీవ్రఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా మెదడు రక్తస్రావం తీవ్రమైన సమస్యగా మారుతుంది. చాలా అత్యవసరమైన పరిస్థితి. రోగి ప్రాణాలను కాపాడటంతోపాటు వైకల్యం రాకుండా ఉండాలంటే తక్షణమే శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉంది’అని ఆయన చెప్పారు.

బ్రెయిన్ బ్లీడింగ్ సాధారణమా? :
కిందపడిపోవడం లేదా తీవ్రమైన గాయాల తర్వాత మెదడు రక్తస్రావం సాధారణంగా ఉంటుంది. కొంతమందిలో హైబీపీ ఉన్నవారిలో కూడా సాధారణంగా మెదడులో రక్తస్రావం తరచుగా జరుగుతుంటుంది. నరాలు చిట్లిపోయి పక్షవాతానికి దారితీస్తుంది.

కారణాలివే :
నిపుణులు చెప్పే కారణాల్లో ఎక్కువగా గాయం లేదా తల గాయం తగిలినప్పుడు ఇలా జరుగుతుంది. మెదడు ఇన్ఫార్క్ట్ (గడ్డకట్టడం), గ్లియోమా వంటి మెదడు కణితులు, మెటాస్టేసెస్ (శరీరంలోని ఇతర భాగాల నుంచి మెదడుకు క్యాన్సర్ వ్యాప్తి), మెదడు ఇన్ఫెక్షన్లు ఉంటాయిని డాక్టర్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు. కిందపడిపోవడం లేదా తీవ్ర గాయాల తర్వాత మెదడు రక్తస్రావం సాధారణంగా ఉంటుంది. కొంతమందిలో హై బీపీ కంట్రోల్ లేనివారిలో సాధారణంగా ఈ పరిస్థితి వస్తుంటుంది.

మెదడులో బ్లీడింగ్ ప్రాణాంతకమా? :
అవును. ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటే చనిపోతారు. లేదంటే దీర్ఘకాలిక వైకల్యాన్ని గురవుతారు. మెదడు కణాలు చనిపోతే.. మళ్లీ అవి కోలుకోవు. నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. శారీరక, మానసికంగానే కాదు.. వైకల్యంతో ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది.

లక్షణాలేంటి? :
సద్గురు విషయంలో ముఖ్య లక్షణం తలనొప్పి. భరించలేనంత తీవ్రమైన తలనొప్పి వచ్చింది. తలనొప్పిని నిర్లక్ష్యం చేయరాదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఆకస్మిక జలదరింపు, బలహీనత, ముఖం, చేయి లేదా కాలులో తిమ్మిరి, మీ శరీరం ఏదైనా భాగం ఒక వైపు పడిపోవడం లేదా పక్షవాతం రావడం వంటి ఇతర లక్షణాలుగా చెప్పవచ్చు. కొంతమంది బాధితుల్లో వికారం, వాంతులు, సరిగా మాట్లాడలేకపోవడం, శక్తి లేకపోవడం, నడవ లేకపోవడం, నిద్రలేమి కూడా ఉంటుంది.

కొంతమంది వ్యక్తుల్లో మింగడంలో ఇబ్బంది, దృష్టి కోల్పోవడం, కాంతిని భరించలేకపోవడం, సమన్వయం కోల్పోవడం వంటివి కూడా ఉంటాయి. అనేక సందర్భాల్లో బాధితులు స్పృహ కోల్పోవడం లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. మెదడు రక్తస్రావం పరిస్థితిని ఎదుర్కొనే చాలా మంది బాధితుల్లో కనిపించే మొదటి లక్షణం ఆకస్మిక తీవ్రమైన తలనొప్పి అని గమనించాలి.

వ్యాధి నిర్ధారణ ఎలా? :
సిటీ స్కాన్, ఎంఆర్ఐ లేదా MRA (మాగ్నెటిక్ రెసొనెన్స్ యాంజియోగ్రఫీ) వంటి టెస్టుల ద్వారా మెదడులో రక్తస్రావాన్ని ఎంత స్థాయిలో ఉందో నిర్ధారించవచ్చు

చికిత్స ఏంటి? :
మెదడులో బ్లీడింగ్ పరిస్థితి తీవ్రతను బట్టి వైద్యులు శస్త్రచికిత్స చేస్తారు. మందుల ద్వారా అవసరమైన చికిత్స చేస్తారు.

నివారణ ఇలా :
ముందుగా, మీ బీపీని అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. పొగాకు, మద్యపానాన్ని పూర్తిగా మానేయాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం రక్తంలోని చక్కెర స్థాయిలను తప్పనిసరిగా అదుపులో ఉంచుకోవాలి.

Read Also : Brain Stroke Symptoms : మీ చేతిలో బలహీనతగా అనిపిస్తుందా? కదిలించలేకపోతున్నారా? బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభ సంకేతాలివే..!

ట్రెండింగ్ వార్తలు