దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం అందచేసే బతుకమ్మ చీరలు ముస్తాబవుతున్నాయి. నిర్ణీత గడువులోగా వీటిని లబ్దిదారులకు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే పండుగకంటే ముందుగానే చీరలు అందనున్నాయి. గత సంవత్సరం ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంపిణీలో జాప్యం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎలాంటి అవాంతరాలు రాకుండా..చీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
బతుకమ్మ చీరల కోసం రూ. 320 కోట్లు ఖర్చు చేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే సిరిసిల్ల చేనేత కార్మికులకు ఆర్డర్ జారీ చేసింది. మొత్తం 6.84 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు 4.67 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి, కోటి చీరలకు గాను..60 లక్షల చీరల తయారీ పూర్తయిందని అంచనా.
బంగారు జరీ వర్ణం అంచు..వృద్దుల కోసం ఆరు గజాలు, మిగతా వారికి ఫ్యాన్సీ టైపులో చీరలు ఇవ్వనున్నారు. 80 రంగులున్నాయి. వీటిని జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ నిపుణులు డిజైనింగ్ చేశారు. సిరిసిల్ల చీరలకు ప్రాచుర్యం తెచ్చేందుకు బతుకమ్మ చీరలపై శిరిశాల లేదా..శ్రీ శాల పేరిట ప్రత్యేక లోగోను తయారు చేయాలని చేనేత శాఖ నిర్ణయం తీసుకుంది. 23 వేల మరమగ్గాలు ఉంటే..అందులో 17 వేలకు పైగా మగ్గాలపై బతుకమ్మ చీరలను తయారు చేస్తున్నారు కార్మికులు.
రోజుకు 9 లక్షల మీటర్ల చీరల వస్త్ర ఉత్పత్తి జరుగుతోంది. బతుకమ్మతో పాటు..రంజాన్, క్రిస్మస్ కానుకలు, కేసీఆర్ కిట్లు, యూనిఫాంలకు సంబంధించిన ఆర్డర్స్ వీరికే అందచేస్తుంది ప్రభుత్వం. దీనివల్ల వారి ఆదాయం పెరుగుతోంది. గతంలో వీరి నెలవారీ ఆదాయం రూ. 8 వేలు లోపు ఉండేది. ప్రస్తుతం సగటున కార్మికుడికి రూ. 16 వేల నుంచి రూ. 20 వేలు అందుతుందని చేనేత శాఖ అంచనా.
Read More : గుడ్ న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ