తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై సీఎం కేసీఆర్ మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అక్టోబర్ 06వ తేదీ జరిపిన మీటింగ్‌కు కొనసాగింపుగా ఈ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో ఈ మీటింగ్ జరుగనుంది. ఆర్టీసీపై అధ్యయన వివరాలను రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ కమిటీ ముఖ్యమంత్రికి వివరించనుంది. తాజా పరిస్థితులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అద్దె బస్సులు, ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు, కొత్త సిబ్బంది నియామకం తదితర అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మరోసారి సమీక్ష నిర్వహిస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు సమ్మె మూడో రోజుకు చేరుకుంది. బస్సులు డిపోల నుంచి కదల్లేదు. ఎంజీబీఎస్‌తోపాటు పలుచోట్ల 144 సెక్షన్ కొనసాగుతోంది. దసరా పండగకు ఊళ్లకు వెళ్లేవారికి ఇబ్బందులు తలెత్తకుండా.. పోలీసుల భద్రతతో బస్సులు నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే… ఆ బస్సుల్లో ఎక్కితే చాలు బలవంతపు దోపిడీ అమలవుతోంది. జస్ట్ రెండు కిలోమీటర్ల జర్నీకి కూడా 20 రూపాయలు తీసుకుంటున్నారు తాత్కాలిక కండక్టర్లు. ఇక దూర ప్రాంత బస్సుల ఛార్జీలకు అంతేలేకుండా పోయింది. కానీ.. వేరే వాహనాలు లేకపోవడంతో అధిక ఛార్జీలు చెల్లిస్తూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు ప్రయాణికులు.
ఇదిలా ఉంటే..హైదరాబాద్ గన్‌పార్క్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నివాళులర్పించేందుకు గన్ పార్క్ వద్దకు చేరుకున్న ఆర్టీసీ జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమ్మెపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం.. 15రోజుల్లో యథాతథంగా బస్సులు తిప్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది. మరోసారి ఆర్టీసీలో సమ్మె జరగకుండా అడుగులు వేస్తోంది. ఇందుకోసం షరతులతో కొత్త సిబ్బందిని నియమించబోతోంది. ఇటు.. ప్రభుత్వం తాను అనుకున్న పంథాలో ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో.. కోర్టు కూడా సమ్మె వద్దంటే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. సమ్మెకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుంది, ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది సస్పెన్స్‌గా మారింది.
Read More : కొత్త కొలువులకు కండీషన్ అప్లై: ఆర్టీసీలో చేరాలంటే అందులో సంతకం చేయాల్సిందే