చంపుతామని బెదిరిస్తున్నారు.. హోంమంత్రికి కిషన్‌రెడ్డి ఫిర్యాదు

  • Publish Date - March 13, 2019 / 04:35 AM IST

బీజేపీ నేత, అంబర్‌పేట మాజీ ఎమ్మెల్యే జీ.కిషన్‌రెడ్డికి పలు ముస్లీం దేశాల నుండి బెదింపులు వస్తున్నాయట. ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. తనను చంపుతామని బెదిరిస్తున్నారని, కేంద్రమంత్రిని కలిసిన ఆయన చెప్పారు.

లండన్‌లో జనవరి 21న కాంగ్రెస్‌ నేత కపిల్‌సిబాల్‌, సయ్యద్‌ సుజా అనే వ్యక్తి కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టి 2014 ఎన్నికలకు ముందు తాను 11 మందిని హత్య చేయించానంటూ ఆరోపణలు చేసిన విషయాన్ని ఆయన కేంద్ర హోంమంత్రికి గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు తోడ్పడ్డానని ఆరోపించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లిన కిషన్ రెడ్డి.. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సీబీఐకు ఈ కేసును అప్పజెబితే అసలు నిజానిజాలు వెల్లడి అవుతాయని ఆయన రాజ్‌నాధ్‌ను కోరారు. గతంలో కూడా తనకు లష్కరే తోయిబా పేరుతో బెదిరింపు లేఖ వచ్చినట్లు కిషన్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.

ఫిర్యాదు అనంతరం తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా చేసిన కపిల్‌సిబల్‌ నిరాధారమైన ఆరోపణలు చేశారని, దాంతో తన పరువుకు భంగం కలిగించినందున ఆయనపై పరువు నష్టం దావా వేస్తానన్నారు. అలాగే తెలంగాణలో 16 సీట్లు గెలిపిస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతామంటూ టీఆర్ఎస్ అనడం నవ్వు తెప్పిస్తుందని అన్నారు.

ప్రస్తుతం 15 మంది ఎంపీలతో ఏం చేశారంటూ ఆయన ప్రశ్నించారు. నరేంద్రమోడీ దేశానికి మళ్లీ ప్రధాని అవుతారని, దేశ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు ఎలా అడుగుతుందని ఆయన విమర్శించారు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని, ఎక్కడి నుంచి అనేది పార్టీ నిర్ణయిస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.