fire accident in hardware shop at Kukatpally : హైదరాబాద్ కేపీహెచ్‌బీ అగ్నిప్రమాదంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. 7గంటలుగా ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నప్పటికీ మంటలు అదుపులోకి రావడం లేదు. అగ్ని ప్రమాదం సంభవించిన షాపులో ఓ వైపు ప్లాస్టిక్, మరోవైపు పెయింట్స్ నిల్వలు ఉండటంతో మంటలు తగ్గినట్లే తగ్గి మళ్లీ అంటుకుంటున్నాయి.
బిల్డింగ్ ముందు భాగం నుంచి లోపలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వెనక భాగంలో అధికారులు గోడలను బద్దలు కొట్టారు. అక్కడ్నుంచి లోపలకు వెళ్లినప్పటికీ దట్టమైన పొగ, ఊపిరి ఆడకపోవడంతో ఫైర్ సిబ్బంది వెనక్కు తగ్గారు. ఆరు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదనంగా 15 వాటర్ ట్యాంకులనీటిని కూడా ఉపయోగించారు. ఇతర ప్రాంతాల నుంచి ఫైర్ సిబ్బందిని కూడా తరలిస్తున్నారు.
మంటల ధాటికి బిల్డింగ్ గోడలకు భారీగా పగుళ్లు వచ్చాయి. ఎప్పుడు మంటలు చెలరేగుతాయోననే టెన్షన్‌లో పక్క షాపుల యజమానులు ఉన్నారు. ఈబిల్డింగ్‌లో సీఎంఆర్ జ్యుయలరీ షాపు కూడా ఉంది. వేడికి బంగారం ఏమైపోతుందోనని షాపు యాజమాన్యం టెన్షన్‌లో ఉంది. సిబ్బంది లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు అడ్డుకున్నారు. పక్కనున్న షాపులను కూడా ఖాళీ చేయిస్తున్నారు.
నలుగురిని కాపాడిన పైర్ సిబ్బంది
ఆదివారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ఏర్పడ్డ షార్ట్ సర్క్యూట్‌తో హార్డ్‌వేర్, శానిటరీ షాపులో మంటలు రేగాయి. మంటలు క్షణాల్లోనే షాపంతా వ్యాపించాయి. బిల్డింగ్ పైభాగంలో ఇరుక్కుపోయిన వాచ్‌మెన్‌తో పాటు మరో ముగ్గుర్ని కూడా ఫైర్ సిబ్బంది రక్షించారు. ఈ బిల్డింగ్ లోపలకు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో పక్క బిల్డింగ్‌పై నుంచి నిచ్చెనలు వేసి వారిని కాపాడారు.ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.
నిబంధనలు బేఖాతరు ?
ఈ బిల్డింగ్‌కు ఫైర్ సేప్టీ లేదని తెలుస్తోంది. బిల్డింగ్‌కు సెట్‌బ్యాక్ వదలాల్సి ఉన్నప్పటికీ అసలు ఏ మాత్రం పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా లోపల ఫైరింజన్ చుట్టూ తిరిగేందుకు వీలుగా నిర్మాణం ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం అసలు నిబంధనలు పట్టించుకోలేదు.
దీనికి తోడు ప్రతి కమర్షియల్ బిల్డింగ్‌కు అదనంగా బయటవైపు స్టెయిర్‌కేస్ ఉండాలి. కానీ ఈ బిల్డింగ్‌కు అవేమీ లేదు. దీంతో మంటలను అదుపు చేయడం కష్టమవుతోంది. ఫైర్ సిబ్బంది పక్క బిల్డింగ్‌ల మీద నుంచి ఈ బిల్డింగ్ మీదకు వెళ్లారు.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తూనే ఉన్నారు. బిల్డింగ్‌లో కింద సీఎంఆర్ జ్యుయెలరీ షాప్ ఉండగా, పక్కన జాయ్ అలుక్కాస్ ఆభరణాల షోరూమ్ ఉంది. పండగ సీజన్ కావడంతో షాపుల్లో భారీగా బంగారు ఆభరణాలు ఉంచారు. కొనుగోళ్ల తర్వాత కూడా షాపుల్లో భారీగా ఆభరణాలు ఉన్నాయి.
ఆరున్నర గంటలుగా మంటలు అదుపులోకి రాకపోవడంతో వేడికి బంగారం కరిగిపోతుందేమోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మంటల ధాటికి బిల్డింగ్ గోడలకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. దీంతో బిల్డింగ్ కూలిపోతుందేమోనన్న వ్యాపారులు భయపడుతున్నారు.
మంటలు తక్షణమే అదుపులోకి రాకపోతే… వ్యాపారులకు భారీ నష్టం తప్పదు. ఆరుగంటలకు పైగా చెలరేగిని నిప్పులతో భవనం మొత్తం ఆవిర్లు చిమ్ముతోంది. దట్టమైన పొగ ఆవరించి ఉండటంతో ఫైర్ సిబ్బంది లోపలకు వెళ్లి పూర్తి స్ధాయిలోమంటలను అదుపు చేయలేకుపోతున్నట్లు అధికారులు వివరించారు.