HMDA Auction: మళ్లీ వేలం.. అమ్మకానికి కొత్త ప్లాట్లు.. ఈ సారి ఎన్ని వందల కోట్లు పలుకుతాయో..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA Auction) కూడా కీలక భూములను వేలానికి సిద్ధం చేసింది.
- V Santhosh Kumar
- Published on- June 10, 2026 / 12:23 PM IST
Hmda to auction prime banjara hills land and 176 plots across hyderabad
- బంజారాహిల్స్ భూములు వేలానికి సిద్ధం
- రూ.1,500 కోట్ల ఆదాయ లక్ష్యం
- జూన్ 17న ఈ-వేలం ప్రారంభం
HMDA Auction: తెలంగాణ ప్రభుత్వానికి భూముల వేలం మరోసారి భారీ ఆదాయ వనరుగా మారనున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన రికార్డు స్థాయి భూ వేలాల అనంతరం, ఇప్పుడు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA Auction) కూడా కీలక భూములను వేలానికి సిద్ధం చేసింది. ముఖ్యంగా నగరంలోని అత్యంత ప్రీమియం ప్రాంతమైన బంజారాహిల్స్‌లో తొలిసారిగా భూమిని వేలానికి తీసుకురావడం రియల్ ఎస్టేట్ రంగంలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
జూన్ 17 నుంచి 30 వరకు నిర్వహించనున్న ఈ ఈ-వేలాల్లో మొత్తం 176 భూ పార్సిళ్లను HMDA అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో బంజారాహిల్స్‌లోని 8.24 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ స్థలానికి రూ.99 కోట్ల కనిష్ఠ ధరను నిర్ణయించారు. అదనంగా మొకిలాలో 100 ప్లాట్లు, మేడిపల్లిలో 68 ప్లాట్లు, అలాగే నర్సింగి, పీర్జాదిగూడ, చందానగర్, బైరాగిగూడ, బౌరంపేట ప్రాంతాల్లోని భూములు కూడా వేలంలో ఉండనున్నాయి.
ఈ వేలాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.1,500 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బంజారాహిల్స్ భూమి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సమీపంలో ఉండటంతో పాటు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానం చేసే అవకాశాలు ఉండటం దీని విలువను మరింత పెంచుతున్నాయి. దీంతో ఈ వేలాలపై రియల్ ఎస్టేట్ సంస్థలు, పెట్టుబడిదారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
