కరోనా నుంచి కాపాడుకోండి: ఇంట్లోనే శానిటైజర్‌ చేసుకోవడం ఎలా?

  • Published By: veegamteam ,Published On : March 15, 2020 / 02:53 AM IST
కరోనా నుంచి కాపాడుకోండి: ఇంట్లోనే శానిటైజర్‌ చేసుకోవడం ఎలా?

Updated On : March 15, 2020 / 2:53 AM IST

కరోనా వైరస్‌ విశ్వరూపం దాలుస్తోంది. ప్రపంచమంతా విస్తరిస్తూ.. రోజురోజుకూ కంగారు పెట్టేస్తున్న కరోనా.. సామాన్యులకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్పటికే మన దేశంలో కూడా కరోనా సోకుతున్న వ్యక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ ప్రభావంతో శానిటైజర్లు, మాస్కులకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. 

ప్రస్తుతం తెలంగాణలో పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదిలా ఉంటే దొనికిందే టైమ్ అనుకుని కొందరు మాస్కుల ధరలను విపరీతంగా పెంచేసి అమ్ముకుంటున్నారు. అలాగే శానిటైజర్ల రేట్లు పెంచేశారు. ఈ క్రమంలో శానిటైజర్‌లను ఎలా తయారు చేసుకోవాలనే విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఫార్ములాను ప్రతి ఒక్కరూ తెలుసుకుంటున్నారు. 

వైద్యులు కూడా శానిటైజర్‌లను ఎలా తయారు చేసుకోవాలనే విషయమై అవగాహన, తయారీ విధానం వీడియోలు పెడుతున్నారు. రూ.19తోనే 200 మి.లీ. శానిటైజర్‌ తయారు చేసుకునే పద్ధతిని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఫార్ములా ప్రకారం.. తమ వైద్య బృందంలోని నిపుణుల ద్వారా శానిటైజర్‌ తయారీ విధానం, అందులో వాడాల్సిన పదార్ధాలు, లభించే దుకాణాలను విశ్వేశ్వర్‌రెడ్డి ట్విట్టర్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. శానిటైజర్‌ తయారీకి వినియోగించే లిక్విడ్స్ నగరంలోని అబిడ్స్‌ తిలక్‌రోడ్‌లోని ల్యాడ్‌ కెమికల్స్‌ విక్రయించే దుకాణాల్లో లభిస్తాయట.

తయారు చేసుకునేందుకు కావలసినవి: 

– స్వచ్ఛమైన నీరు – 90 మి.లీ.
– ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ – 100 మి.లీ.
– హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌  – టేబుల్‌ స్పూన్‌
– గ్లిజరిన్‌/గ్లిజరాల్‌ – టేబుల్‌ స్పూన్‌

తయారీ చేసుకునేది ఎలాగంటే?
ముందుగా 100 మి.లీ ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ను శుభ్రమైన పాత్రలో తీసుకోవాలి. దీనికి టేబుల్‌ స్పూన్‌ చొప్పున గ్లిజరిన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలపాలి. దీనికి 90 మి.లీ శుద్ధమైన నీరు పోయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని బాగా కలిపి.. ఖాళీ స్ప్రే బాటిల్‌ లేదా డిస్పెన్సింగ్‌ బాటిల్‌లో పోసి శానిటైజర్‌గా వాడుకోవచ్చు.