ప్రగతి భవన్ లో కేసీఆర్, జగన్ భేటీ

  • Publish Date - September 22, 2019 / 01:45 PM IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మళ్లీ సమావేశమవుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపై వారు చర్చించనున్నారు. ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సెప్టెంబరు 23, సోమవారం ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆయన ప్రగతి భవన్ లో భేటీ కానున్నారు.  ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన వీరు.. ముచ్చటగా మూడో సారి భేటీ  అవుతున్నారు..  సీఎంలతోపాటు మంత్రులు, సీనియర్ అధికారులు ఈ భేటీలో పాల్గొంటారు.

ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై చర్చించనున్నారు. వరద నీటిని వృధాగా సముద్రంలోకి వదలడం కన్నా.. సద్వినియోగం చేసి కరవు ప్రాంతాల్లో నీటి కష్టాలు తీర్చాలని ఇద్దరు సీఎంలు భావిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రులు.. ఇప్పుడు నదుల అనుసంధానంపై ప్రత్యేకంగా చర్చించే అవకాశముంది. అంతేకాదు.. విభజన సమస్యలపైనా సీఎంల మధ్య చర్చలు జరుగనున్నాయి. 

ఇంతకుముందు జరిగిన సమావేశాల్లో విభజన సమస్యలతోపాటు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, నీటి పంపకాలపై చర్చించారు. ఇప్పుడు మరోసారి సమావేశమై నదుల అనుసంధానంపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. నదుల అనుసంధానికి సంబంధించి ఇప్పటికే ఇరు రాష్ట్రాల అధికారులు అధ్యయనం చేశారు. నివేదికలు సీఎంలకు అందజేశారు. దీంతో నదుల అనుసంధానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.