ఆర్టీసీ సమ్మె 23వ రోజు : తేలని పంచాయతీ..బస్సు రోడ్డెక్కేనా

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 23వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని..ఇతరత్రా డిమాండ్స్‌తో అక్టోబర్ 05 నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగకపోతుండడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. అరకొరగా తిరుగుతున్న బస్సులతో ప్రయాణీకులు అష్టకష్టాలు పడుతున్నారు. గమ్య స్థానాలకు చేరుకోవడానికి క్యాబ్స్, ఆటోలు, ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. దీంతో జేబు గుల్లవుతోందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
ఇక అక్టోబర్ 26వ తేదీ శనివారం కార్మిక సంఘాలు – యాజమాన్యం మధ్య చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. అందరూ అనుకున్నట్లుగానే..21 అంశాలపై చర్చిస్తామని అధికారులు..కాదు…కాదు..26 డిమాండ్లపై చర్చించాలని కార్మిక సంఘాలు పట్టుబట్టడంతో పరిస్థితి ముందుకొచ్చింది. కార్మికుల సమస్యలపై చర్చించేందుకు జేఏసీ నేతలు సహకరించలేదని.. ప్రభుత్వంలో విలీనం మినహా మిగతా వాటిపై చర్చిస్తామంటే కార్మిక సంఘాల నేతలు ఒప్పుకోలేదన్నారు ఆర్టీసీ అధికారులు.
అక్టోబర్ 28వ తేదీన చర్చల సారాంశాన్ని హైకోర్టుకు అందజేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో… మరో రోజే గడువు ఉండటంతో మళ్లీ చర్చలు జరుగుతాయా.. సమ్మెకు పరిష్కార మార్గం దొరుకుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే యాజమాన్యం ఎప్పుడు పిలిచినా మళ్లీ చర్చలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని జేఏసీ నేతలంటున్నారు. అయితే.. కార్మిక సంఘాల నేతలు ఎప్పుడు వచ్చినా చర్చలకు సిద్ధమే అంటున్నారు ఆర్టీసీ అధికారులు.
ఈ పరిస్థితుల్లో అక్టోబర్ 27వ తేదీ ఆదివారం మళ్లీ చర్చలు జరుగుతాయా.. ఒకవేళ జరిగితే… 21 అంశాలపై చర్చిస్తారా.. లేక 26 అంశాలను పరిగణలోకి తీసుకుంటారా అనే విషయం ఉత్కంఠ కలిగిస్తోంది. ఆర్థిక పరమైన అంశాలు మినహా.. మిగతా డిమాండ్లను పరిశీలించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి యాజమాన్యం పెట్టే కండీషన్స్‌కు కార్మిక సంఘాలు ఒప్పుకుంటాయా.. జేఏసీ డిమాండ్లకు యాజమాన్యం తలొగ్గుతుందా… చూడాలి.
Read More : 110 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలింపు : ఇద్దరు అరెస్టు