తేజస్ ఫైటర్ ఫ్లైట్ ఏంటి స్పెషాలిటీ.. ఇండియాకు బెనిఫిట్ ఎంత

తేజస్ ఫైటర్ ఫ్లైట్ ఏంటి స్పెషాలిటీ.. ఇండియాకు బెనిఫిట్ ఎంత

Tejas fighter jets

Updated On : February 3, 2021 / 7:15 PM IST

నింగిని చీల్చుకుంటూ.. గగనతలంలో భారత్ సత్తా చాటేందుకు.. మరికొద్ది రోజుల్లో తేజస్ ఫైటర్ జెట్స్ దూసుకురానున్నాయ్. ఈ మేర 83 యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. తేజస్‌కే ఎందుకు అంత ప్రాధాన్యత? వాటి స్పెషాలిటీస్ ఏంటి…?

వైమానికి దళానికి ప్రభుత్వం కొత్త రక్తం ఎక్కిస్తోంది. దేశీయ తేలికపాటి యుద్ధవిమానం తేజస్‌ ఎంకే1ఏ రకం కొనుగోలుకు ఒప్పందాలు జరిగిపోయాయ్. 83విమానాలు భారత్‌ అమ్ములపొదిలో చేరనున్నాయ్. నిజానికి తేజస్ ప్రాజెక్ట్ అనగానే రకరకాల విమర్శలు! 35ఏళ్ల పాటుసాగింది.. ఉత్పత్తి అంతంతమాత్రమే అని ! విదేశీ పరికరాలు ఎక్కువగా ఉపయోగిస్తారనే విమర్శలు కూడా వినిపించాయి. విమాన సామర్థ్యంపై మాత్రం ఎలాంటి మాట లేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఎల్‌సీఏ విభాగంలో తేజస్‌ ప్రపంచంలోనే అత్యుత్తమైందని చెప్తుంటారు. అలాంటి అడ్వాన్స్‌డ్ వెర్షన్ ఎంకే1 వస్తుందంటే.. పవర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

వాస్తవానికి భారత వాయుసేనకు యుద్ధ విమానాల కొరత ఉంది. ఎయిర్‌ఫోర్స్ అవసరాలు తీర్చాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే 42స్క్వాడ్రన్‌లు ఉండాలి. ఐతే కాలం చెల్లిన మిగ్‌ల తొలగింపు.. విమాన ప్రమాదాల కారణంగా వీటి సంఖ్య ఇప్పుడు 30కి అటుఇటుగా ఉంది. 18 విమానాల జట్టును ఓ స్క్రాడ్రన్‌గా లెక్కేస్తారు. ఐతే ఇప్పుడు మరో 83తేజస్‌ విమానాలు 2026నాటికి వాయసేనలో చేరనున్నాయి. తొలి విమానం 2022లో చేతికి అందగా.. ఈ మోడల్‌ తొలి స్క్వాడ్రన్‌ 2024లో పూర్తికానుంది.

తొలి తరం తేజస్‌తో పోలిస్తే ఎంకే1ఏ రకంలో చాలా రకాల మార్పులు కనిపించనున్నాయ్. ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్‌ ఎంకే1కి ఇది అడ్వాన్స్ మోడల్‌. దీనిలో క్వాడ్రప్లక్స్‌ డిజిటల్‌ ఫ్లైబైవైర్‌ వ్యవస్థను వినియోగించారు. విమానం బరువు తగ్గించేందుకు తయారీలో ప్రత్యేక మిశ్రమ లోహాలను వినియోగించారు. వీటి వల్ల విమానం పనిచేసే కాలం కూడా పెరుగుతుంది. ఇది 3వేల 5వందల కిలోల ఆయుధాలను తీసుకెళ్లగలదు. భూమి 15 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ దాడుల్లో పాల్గొనగలదు. గాల్లోనే ఇంధనం నింపుకొనే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఇది సూపర్‌సానిక్‌ వేగంతో ప్రయాణించగలదు.

తేజస్‌ ఏంకే1ఏలో దేశీయ పరికరాలు 50శాతం నుంచి 60శాతానికి చేర్చనున్నారు. లార్సన్‌ అండ్‌ టుబ్రో, డైనమాటిక్‌ టెక్నాలజీస్‌, ఆల్ఫాడిజైన్‌ వంటి 70కిపైగా ప్రముఖ సంస్థలు దీనిలో తయారీలో భాగస్వాములు అవుతున్నాయ్. ఉత్పత్తి నెమ్మదిగా సాగుతుందన్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు హెచ్ఏఎల్ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ప్రొడక్టివిటీ వేగవంతం చేయడానికి నాసిక్‌, బెంగళూరు డివిజన్లలో రెండో తయారీ యునిట్లను కూడా సిద్ధం చేసింది. ప్రస్తుతం HALలో ఏడాదికి 8విమానాలను మాత్రమే తయారుచేస్తున్నారు. ఇప్పుడు ఆ స్థాయిని 16కి పెంచనున్నారు. ఇక్కడ అదనపు సౌకర్యాల కోసం ప్రభుత్వం కూడా 12వందల కోట్లు మంజూరు చేసింది. దీంతోపాటు వచ్చే సరికొత్త విమానాల కోసం బేసుల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

సరికొత్త తేజస్‌ విమానాల్లో యాక్టివ్‌ ఎలక్ట్రికల్లీ స్కాన్డ్‌ యారే రాడార్లను వినియోగించనున్నారు. ఇవి అత్యాధునికమైనవి. శత్రుదేశాల ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ వ్యవస్థను సమర్థవంతంగా తట్టుకొని పని చేస్తుంది. దీంతోపాటు శత్రుదేశాల రాడార్ వార్నింగ్‌ రిసీవర్లు… వీటిని అడ్డుకోవడం కష్టం. దీంతోపాటు వివిధ మోడల్‌లలో కూడా పనిచేస్తుంది. రియల్‌బీమ్‌ మ్యాపింగ్‌, భూమిపై కదిలే లక్ష్యాలను గుర్తించడం, గగనతలంలో వచ్చే ముప్పులను గుర్తించడం వంటివి చేస్తుంది. ఇది ఏకకాలంలో 16 లక్ష్యాలను గుర్తించగలదు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయ్ కాబట్టే తేజస్ ఎంకే1ఏ ఫైటర్ జెట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారుతున్నాయ్. ఈ సౌకర్యం, సౌలభ్యం వల్లే ఎన్ని ఆప్షన్స్ ఉన్నా.. తేజస్‌కే జై కొట్టింది కేంద్రం.

జామింగ్‌పాడ్‌ అమర్చడం మరింత కలిసొచ్చే అంశం
వీటితో పాటు తేజస్ విమానాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయ్. శత్రుదేశాల గగనతలంలోకి ప్రవేశించాక… యుద్ధవిమానాలను పలు రకాల సిగ్నల్స్‌.. తరంగాలు వెంటాడుతుంటాయ్. ఇవి విమానం డైరెక్షన్ పసిగట్టేందుకు… కమ్యూనికేషన్ల వ్యవస్థను జామ్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంటాయ్. ఇలాంటి వాటిని బ్రేక్ చేస్తూ.. దొరకకుండా ముందుకు వెళ్లేందుకు ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ సూట్‌ యూజ్ అవుతుంది. ముప్పును గమనించి ముందే వాటిని జామ్‌ చేయడంలాంటివి చేయొచ్చు. ఈ విమానం బయట జామింగ్‌పాడ్‌ అమర్చడం మరింత కలిసొచ్చే అంశమని నిపుణులు అంటున్నారు.

కంటికి కనిపించే పరిధిలో ప్రత్యేకమైన గన్స్‌తో, క్షిపణులతో యుద్ధవిమానాలు పరస్పరం తలపడితే దాన్ని డాగ్‌ఫైట్‌ అంటారు. ఆధునిక యుద్ధతంత్రంలో విమానాలు నేరుగా తలపడే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. శత్రువు చూడకముందే.. గుర్తించి దాడి చేస్తాయ్. ఇందుకోసం శక్తివంతమైన రాడార్లు.. బియాండ్‌ విజువల్‌ రేంజ్‌ క్షిపణులను వినియోగిస్తారు. తేజస్‌ ఎల్‌సీఏ1ఏలో డెర్బీ క్షిపణిని ఉపయోగించవచ్చు. దీంతో పాటు అస్త్రమాక్ 1 బీవీఆర్‌ మిసైల్‌ను కూడా వినియోగించేందుకు వీలుంది. ఇలా సామర్థ్యం పరంగా ఎలా లెక్కేసుకున్నా.. ఎయిర్‌ఫోర్స్‌కు మరో బ్రహ్మాస్త్రం చేరనున్నట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఇప్పటికే రఫెల్ రాకతో బలంగా కనిపిస్తున్న వాయుసేన.. ఇప్పుడు మరింత స్ట్ర్రాంగ్‌గా మారడం ఖాయం.