Georgia
Twelve Indians Die in Georgia: జార్జియాలో విషాదం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో 12 మంది మృతిచెందగా.. వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు. స్కై రిసార్ట్ గా ప్రసిద్ధి చెందిన గూడౌరిలోని భారతీయ రెస్టరెంట్ అయిన హవేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందించింది. 11 మంది భారతీయులు మృతిచెందారని, ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంది. మృతదేహాలను వారి ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు భారతీయ రాయబార కార్యాలయం పేర్కొంది.
ఈ విషాద ఘటన ఈనెల 14న జరిగినట్లు తెలుస్తోంది. మృతదేహాలను రెస్టరెంట్ లోని రెండో ఫ్లోర్ లో గుర్తించారు. వారంతా రెస్టరెంట్ లో సిబ్బందిగా తెలిసింది. వారి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మృతుల శరీరాలపై ఎలాంటి దాడి జరిగిన ఆనవాళ్లు లేవని, శరీర భాగాలపై ఎలాంటి గాయాలు లేవని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లనే వారంతా చనిపోయినట్లు భావిస్తున్నారు.
Also Read: లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అమెరికా వెళ్లనున్న కేసీఆర్.. రెండు నెలలు అక్కడే ఉండేందుకు ప్లాన్
పోలీసుల ప్రాథమిక విచారణలో.. వారి బెడ్ రూం సమీపంలో ఉన్న పవర్ జనరేటర్ నుంచి విడుదలైన విష వాయువు మూసిఉన్న గదిలో కార్బన్ మోనాక్సైడ్ గా మారినట్లు, తద్వారా వారు చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఖచ్చితమైన సమాచారం కోసం ఫోరెన్సిక్ విచారణ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు.