Nigeria Market (Image Credit To Original Source)
Nigeria: నైజీరియాలోని నైజర్ రాష్ట్రంలో ఓ మార్కెట్‌లో తీవ్ర కలకలం చెలరేగింది. కొందరు దుండగులు కాల్పులు జరపడంతో దాదాపు 30 మంది మృతి చెందారు. పలువురు అపహరణకు గురయ్యారు.
పోలీసు ప్రతినిధి వాసియు అబియోడున్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా బ్యాండిట్లు అని పిలిచే సాయుధులు డెమో గ్రామంలోని కసువాన్ దాజీ మార్కెట్‌లోకి ప్రవేశించి దుకాణాలకు నిప్పంటించారు, ఆహార పదార్థాలను దోచుకున్నారు. బ్యాండిట్లు గ్రామీణ ప్రాంతాల్లో దోపిడీలు, హత్యలు, అపహరణలు చేస్తుంటారు.
“దాడి సమయంలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది అపహరణకు గురయ్యారు. వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి” అని అబియోడున్ తెలిపారు.
Also Read: మీ ఇంట్లోని దేవుడి పటాలను ఏ రోజున శుభ్రం చేసుకోవాలి?
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సాయుధులు మోటార్‌సైకిళ్లపై వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. శుక్రవారం నుంచి సమీపంలోని అగ్వార్రా, బోర్గు గ్రామాల్లో వారు దాడులు చేస్తున్నారు. దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఆయా ప్రాంతాల్లో భద్రతా బలగాలు కనపడలేదు. దీనిపై నైజీరియా సైన్యం స్పందించడం లేదు.
కొన్ని వారాల క్రితమే నైజర్ రాష్ట్రంలో క్యాథలిక్ పాఠశాల నుంచి 300 మందికి పైగా పిల్లలు, సిబ్బందిని సాయుధులు అపహరించారు. ఆ బాధితులు దాదాపు ఒక నెల బందీగా ఉన్న తర్వాత విడుదలయ్యారు. ఈ ఘటనను మరవకముందే ఇప్పుడు మళ్లీ దాడులు జరగడం గమనార్హం.
ఉత్తర పశ్చిమ, మధ్య నైజీరియాలో బ్యాండిట్రీ తీవ్రత పెరుగుతోంది. సాయుధ గ్రూపులు గ్రామీణ ప్రాంతాల్లో సామూహిక హత్యలు, అపహరణలకు పాల్పడుతున్నాయి. భద్రతా బలగాలు ఈ హింసను అరికట్టడంలో విఫలమవుతున్నాయి.