Man in hydrogen balloon
Hydrogen Balloon: చైనాలోని ఇద్దరు వ్యక్తులు హైడ్రోజన్ బెలూన్ సహాయంతో చెట్టుకు ఉన్న పైన్ కాయలు(ఈశాన్య చైనాలో వంటల్లో పైన్ కాయలు వాడుతారు) కోస్తున్న సమయంలో బెలూన్ తాడు తెగిపోయింది. ఈ క్రమంలో అప్రమత్తమైన ఓ వ్యక్తి బెలూన్ నుంచి కిందకు దూకాడు. మరో వ్యక్తి మాత్రం బెలూన్ తో సహా గాలిలోకి ఎగిరిపోయాడు. గాల్లోనే రెండు రోజుల పాటు 320 కిలో మీటర్ల దూరం వెళ్లాడు. ఈ ఘటన చైనాలోని హిలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని ఓ అడవిలో ఆదివారం పైన్ కాయలను కోస్తుండగా చోటు చేసుకుంది.
హైడ్రోజన్ బెలూన్ తో సహా వ్యక్తి గాల్లోకి వెళ్లిన విషయాన్ని స్థానికులు అధికారులకు తెలియజేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, వృత్తిపరమైన రక్షకులతో సహా 500 మందికి పైగా బృందం రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహించారు. అయితే అతని వద్ద సెల్ ఫోన్ ఉండటంతో పలుసార్లు అధికారులు కాల్ చేసినా ఉపయోగం లేకుండాపోయింది. మరుసటి రోజు ఉదయం సదరు వ్యక్తికి అధికారులు ఫోన్ చేయగలిగారు. హైడ్రోజన్ బెలూన్ ను కిందికి దించేలా పలు సూచనలు సూచించారు. ఫోన్ సిగ్నల్ సహాయంతో బెలూన్ ఎటువెళ్తుందో ట్రాక్ చేయగలిగారు.
ఒకరోజు తరువాత మంగళవారం ఉదయం సమయంలో రెస్క్యూ టీం సిబ్బంంది సహాయంతో రష్యా సరిహద్దుకు దగ్గరగా ఉన్న చైనాలోని ఫాంగ్‌జెంగ్ ప్రాంతంలో కిందికి చేరుకున్నాడు. అప్పటికే 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించాడు. వ్యక్తి నేలపైకి దిగుతున్న క్రమంలో చెట్టుకు చిక్కుకొని గాయపడ్డాడు. రెండు రోజులు బెలూన్ లో నిలబడటంతో తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. 40ఏళ్లు కలిగిన వ్యక్తి తన వ్యక్తిగత వివరాలు తెలిపేందుకు నిరాకరించాడు. ఇదిలాఉంటే 2019లో ఒక సందర్భంలో చాంగ్‌బాయి పర్వతాలలో పైన్ కాయలను కోస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ల్యాండింగ్‌కు ముందు వారి బెలూన్‌లో 10కిమీ దూరం వెళ్లి విమానయాన నిబంధనలను ఉల్లంఘించినందుకు అరెస్టు చేశారు.