Afghan Boy First Photo: ఇటీవల ఒక కుర్రాడు విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కుని గంటన్నర సేపు ప్రాణాంతక ప్రయాణం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ కుర్రాడు చేసిన దుస్సాహసం అందరీని ఉలిక్కిపడేలా చేసింది. ఆ అబ్బాయి ఎవరు, ఎలా ఉంటాడు అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆ కుర్రాడి ఫస్ట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ అబ్బాయి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ
కుర్రాడు పటానీ సూట్, బ్లాక్ కోట్ ధరించి ఉన్నాడు. ఎయిర్ పోర్టులో ఓ పక్కన నిల్చుని ఉన్నాడు. బాగా టెన్షన్ పడుతూ కనిపించాడు.
అఫ్ఘానిస్థాన్ కు చెందిన 13 ఏళ్ల కుర్రాడు అత్యంత ప్రమాదకరమైన స్థితిలో విమాన ప్రయాణం చేశాడు. కాబూల్ నుంచి ఢిల్లీకి జర్నీ చేశాడు. కాబూల్-ఢిల్లీ కామ్ ఎయిర్ ఫ్లైట్ లో ఆ అబ్బాయి ప్రయాణం చేశాడు. విమానం సెప్టెంబర్ 21న ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్ పోర్టు సిబ్బంది ఆ కుర్రాడిని గుర్తించారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే.. ఆ కుర్రాడిని అదే రోజున రిటర్న్ ఫ్లైట్ లో తిరిగి కాబూల్ కి పంపేశారు అధికారులు. అప్ఘానిస్థాన్ లోని కుందుజ్ ప్రాంతానికి చెందిన అబ్బాయి.. తాను ఇరాన్ కు వెళ్లాలని అనుకున్నట్లు అధికారుల విచారణలో తెలిపాడు. టెహ్రాన్ కు వెళ్తోందని పొరబడ్డ కుర్రాడు.. ఢిల్లీ వెళ్లే విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కున్నాడు. ఆ సమయంలో అతడి దగ్గర కేవలం రెడ్ కలర్ ఆడియో స్పీకర్ మాత్రమే ఉంది. దాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
గంటన్నరకుపైగా వెయ్యి కిలోమీటర్లు ఆ కుర్రాడు గాల్లో ప్రయాణం చేశాడు. సురక్షితంగా ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యాడు. విమాన ప్రయాణం అంటే తనకు ఎంతో ఆసక్తి అని, అందుకే ఇలా చేశానని ఆ కుర్రాడు వివరించాడు.
KMM ఎయిర్ లైన్స్ కు చెందిన ఆర్‌క్యూ-4401 విమానం ఆదివారం ఉదయం 9 గంటలకు అప్ఘానిస్థాన్ లోని కాబూల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలు దేరింది. గంటన్నరకు పైగా ప్రయాణం చేసి ఉదయం 11 గంటలకు గమ్యస్థానానికి (ఢిల్లీ) చేరుకుంది. ప్రయాణికులు, సిబ్బంది అంతా దిగిపోయారు. ఇంతలో ఓ 13 ఏళ్ల బాలుడు విమానం వద్దే తచ్చాడుతూ కనిపించాడు. వెంటనే ఎయిర్ పోర్ట్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒళ్లు గగుర్పొడిచే విషయం వెలుగుచూసింది. విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్ మెంట్ లో దాక్కుని వచ్చానని బాలుడు చెప్పడంతో అంతా షాక్ అయ్యారు.
సెక్యూరిటీ కళ్లు గప్పి ఎయిర్‌పోర్టులోకి చొరబడటమే కాకుండా విమానం బయలుదేరే ముందు ల్యాండింగ్ గేర్‌లోకి ఎక్కి దాక్కున్నట్టు బాలుడు చెప్పడంతో అంతా కంగుతిన్నారు. విమానం అటు ఇటు కుదుపులకు గురైనా.. వేలాడుతూ అలాగే ధైర్యంగా ఉండిపోయినట్లు చెప్పాడు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఆ అబ్బాయి ఢిల్లీకి చేరాడు. అతడు చేసింది నేరమే అయినా.. మైనర్ బాలుడు కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధికారులు. రిటర్న్ విమానంలో తిరిగి కాబూల్‌కు పంపేశారు.
గడ్డ కట్టే చలి, తీవ్రమైన గాలులు లాంటి వాతావరణం మధ్య ఆ బాలుడు ఎలా తట్టుకున్నాడు? అధిక ఎత్తులో తక్కువ వాతావరణ పీడనంతో ఎవరైనా చనిపోవాల్సిందే. కానీ, ఆ అబ్బాయి సేఫ్ గా ఢిల్లీలో ల్యాండ్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు కొన్ని వెలుగు చూశాయి. ఒక దేశం నుండి పారిపోవడానికి ప్రయత్నించే వారు విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో దాక్కోవడం అత్యంత సాధారణ పద్ధతే అయినా.. ఇది చాలా ప్రమాదకరమైనది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోవడం ఖాయం అంటున్నారు అధికారులు.
Also Read: ఆ దేశ అధ్యక్షుడికే షాక్ ఇచ్చిన అమెరికా పోలీసులు.. నడిరోడ్డుపైనే ఇలా.. వీడియో..