Afghan girls paint on wall ‘Let her learn’ to protest over university ban
#LetHerLearn: ‘ఆమె చదువుకోనివ్వండి’.. అఫ్గానిస్తాన్‌లోని గోడలపై ప్రస్తుతం కనిపిస్తున్న నినాదాలు ఇవి. మహిళల్ని యూనివర్సిటీ చదువులకు నిషేధిస్తూ తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది విద్యార్థులు, మహిళలు నిరసన చేపట్టారు. ఈ నిర్ణయాన్ని అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి నిదా మహ్మద్ నదిం సమర్ధించారు. మహిళలకు ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశం అక్కర్లేదని ఆయన గురువారం స్పష్టం చేశారు. యూనివర్సిటీలోకి అనుమతి ఇవ్వడం వల్ల.. ఆడ, మగ ఒకే దగ్గరికి వస్తున్నారని, ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధంగా ఉండడంతో దీన్ని నిరోధించడానికే ఈ కొత్త ఆదేశాలని ఆయన పేర్కొన్నారు. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ ఆదేశం అమలులో ఉంటుందని నదీం పేర్కొన్నారు.
మంత్రి నిదా మహ్మద్ నదిం చేసిన ప్రకటన అనంతరం అఫ్గనిస్తాన్ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. మహిళలు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొన్నారు. ఇప్పటికే రెండవ తరగతి పౌరులుగా ఉన్న తమను ప్రభుత్వం మరింత వెనుకబాటుకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను చదువుకు, జ్ణానానికి దూరం చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫ్ఘాన్ మహిళలు చేస్తున్న ఈ నిరసనకు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా మద్దతు లభిస్తోంది. ‘ఆమె చదువుకోనివ్వండి’ అనే హ్యాష్‌ట్యాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాలిబన్ ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాన్ని తాము ఆందోళనతో గమనిస్తున్నామని, ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల విద్యకు భారతదేశం ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.