Afghanistan
Afghanistan : అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో ఉగ్రమూక రెచ్చిపోయింది. మంగళవారం (ఏప్రిల్ 19,2022)రెండు పాఠశాలలపై ఆత్మాహుతి దాడికి పాల్పడగా ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు. 20మంది తీవ్రంగా గాయపడ్డారు. షియాల ప్రాబల్యం ఉన్న పశ్చిమ ప్రాంతంలోని అబ్దుల్ రహీమ్ షాహిద్ హైస్కూల్‌లో పేలుళ్లు జరిగాయి. మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ముందు దాడి ముంతాజ్ స్కూల్లో దాడి జరగగా.. వెంటనే సరిహద్దుల్లోని దష్తీ బార్చిలో ఉన్న అబ్దుల్ రహీం షాహిద్ అనే పాఠశాల బయట రెండు ఐఈడీలతో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడినట్టు ఖాలిద్ జద్రాన్ అనే పోలీస్ అధికారి చెప్పారు. ఈ పేలుళ్లలో 10 మంది విద్యార్ధులు మరణించారని సమాచారం. కానీ పోలీసులు మాత్రం ఆరు లేక ఏడుగురు విద్యార్ధులు మరణించారని చెబుతున్నారు. రెండు దాడి ఘటనల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.
కాగా.. ఈ దాడి ఐఎస్ ఉగ్రవాదుల పనిగా అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గతేడాది మే నెలలో ఇదే ప్రాంతంలోని ఓ స్కూల్ లో జరిగిన పేలుళ్లలో 85 మంది మరణించగా.. 300 మంది గాయపడ్డారు. తాజా ఘటనతో కాబూల్ ఉలిక్కిపడింది.