Putin, Zelenskyy
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరింది. ఇప్పుడు రష్యా-యుక్రెయిన్ మధ్య కూడా ఇటువంటి ఒప్పందమే కుదరడానికి మార్గం సుగమమైంది. భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిన మరుసటి రోజే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు.
యుక్రెయిన్‌తో ప్రత్యక్ష చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ తెలిపారు. యుక్రెయిన్‌లో రష్యా మూడేళ్లకు పైగా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, యూరప్ మిలటరీ సాయంతో రష్యాను యుక్రెయిన్ ఎదుర్కొంటోంది.
పుతిన్ ఇవాళ ఓ ప్రకటన చేస్తూ.. రష్యా, యుక్రెయిన్ మధ్య జరిగే ప్రత్యక్ష చర్చలు ఇరు దేశాల్లో శాశ్వతంగా శాంతిని నెలకొల్పేలా ఉండాలని తెలిపారు. ఇస్తాంబుల్ వేదికగా వచ్చే వారం చర్చలు జరుపుదామని అన్నారు. ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా యుక్రెయిన్ ఈ చర్చలను తిరిగి ప్రారంభించాలని చెప్పారు.
Also Read: శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం.. 21 మంది మృతి.. మరో 14 మందికి తీవ్రగాయాలు.. ఎలా జరిగిందంటే?
ఇస్తాంబుల్‌లో చర్చల కోసం తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో తాను మాట్లాడతానని పుతిన్ తెలిపారు. యుక్రెయిన్, రష్యా మధ్య చర్చల వల్ల పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. ఇందుకోసం యుక్రెయిన్ నాటోలో సభ్యత్వం తీసుకోవాలన్న ప్రయత్నాలను విరమించుకోవాలని అన్నారు. అలాగే, ఇప్పటికే రష్యా స్వాధీనం చేసుకున్న యుక్రెయిన్‌లోని భూభాగాల నుంచి వారి దళాలు వెనక్కి వెళ్లిపోవాలని చెప్పారు.
జెలెన్‌స్కీ ఏమన్నారు?
పుతిన్ చేసిన ప్రతిపాదనపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. ఎట్టకేలకు యుద్ధాన్ని ముగించాలని రష్యా భావిస్తుండడం ఓ సానుకూల సంకేతమని అన్నారు. ఏ యుద్ధాన్ని అపేయాలన్నా అందుకోసం తీసుకోవాల్సిన మొట్టమొదటి చర్య కాల్పుల విరమణనేనని చెప్పారు. దీంతో, ఇక ఒక్కరోజు కూడా కాల్పులు జరపకూడదని, కాల్పులు జరిపి ప్రాణాలు తీయడంలో అర్థం ఉండదని అన్నారు. యుద్ధాన్ని ముగించాలని రష్యా కోరుకుంటుంటే రేపే కాల్పుల విరమణ ప్రారంభం కావాలని అన్నారు.