రష్యా ప్రపంచానికి తొలి కరోనా వ్యాక్సిన్ అందించనున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 12న కరోనా వ్యాక్సిన్ విడుదల చేస్తామని రష్యా ఇదివరకే ప్రకటించింది. కాగా, రష్యా కరోనా వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా హడావుడిగా వ్యాక్సిన్ ను తయారు చేశారని, ఇతర దేశాల సమాచారాన్ని తస్కరించారని ఆరోపణలు ఉన్నాయి. చావనైనా చస్తాము కానీ రష్యా వ్యాక్సిన్ ను మాత్రం వాడేది లేదని పలు దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యా కీలక ప్రకటన చేసింది. తాము తయారు చేసిన టీకా ఏ విధంగా పని చేస్తుందో వివరించింది.
టీకా ఇలా పని చేస్తుంది:
కరోనా వ్యాక్సిన్ ను రష్యా రక్షణశాఖ, గమేలెయ పరిశోధన సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న ల్యాబ్ చీఫ్ టీకా పనితీరుకి సంబంధించి పలు హింట్స్ ఇచ్చారు. గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ మాట్లాడుతూ, నిర్జీవ కణాలను ఉపయోగించి అడెనోవైరస్ ఆధారంగా టీకా సృష్టించబడింది అని చెప్పారు. వ్యాక్సిన్ ఒక వ్యక్తి ఆరోగ్యానికి హాని కలిగించే ఆందోళనలు లేవని ఆయన అన్నారు. సొంత రకాన్ని పునరుత్పత్తి చేయగల కణాలు మరియు వస్తువులు సజీవంగా పరిగణించబడతాయన్నారు.
టీకా వేసినప్పుడు జ్వరం రావడం సహజం:
టీకాలు వేసిన వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి… శక్తివంతమైన ప్రోత్సాహాన్ని పొందినప్పుడు కొంతమందికి సహజంగానే జ్వరం వస్తుందన్నారు. అయితే పారాసెటమాల్ తీసుకోవడం ద్వారా ఈ “సైడ్ ఎఫెక్ట్” ను సులభంగా అధిగమించవచ్చన్నారు. గమేలెయ ఇన్ స్టిట్యూట్ హెడ్ ప్రొఫెసర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ మరియు ఇతర పరిశోధకులు తమపై టీకాను ప్రయోగించుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. సెప్టెంబర్ లో వ్యాక్సిన్ “పారిశ్రామిక ఉత్పత్తి” ప్రారంభిస్తానని రష్యా ఉప ప్రధాని టాట్యానా గోలికోవా హామీ ఇచ్చారు. అలాగే అక్టోబర్ నెలలో వీలైనంత త్వరలో మాస్ వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామన్నారు.
కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేయడానికి రష్యా సిద్ధమవుతున్న వేళ, అమెరికా ఇన్ ఫెక్షియస్ డిసీజస్ స్పెషలిస్ట్ డాక్టర్ ఆంటోనీ కీలక హెచ్చరిక చేశారు. వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి తెచ్చే ముందు రష్యా, చైనా దేశాలు టీకాను సరైన పద్ధతిలోనే పరీక్షలు చేసి ఉంటాయని భావిస్తున్నా అని చెప్పారు. హడావుడిగా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడం శ్రేయస్కరం కాదన్నారు. వ్యాక్సిన్ ను తమపై ప్రయోగించుకునే వ్యక్తులు అన్ని రకాల పరీక్షలను పూర్తి చేసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసిన సంగతి తెలిసింది.
ఆగస్టు 12న కరోనా వ్యాక్సిన్ విడుదల:
కరోనాకు తొలి వ్యాక్సిన్ త్వరలోనే రాబోతోంది. ప్రస్తుతం చివరి దశ ట్రయల్స్ లో ఉన్న ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 12న రిజిస్టర్ చేయించనున్నట్టు రష్యా డిప్యూటీ హెల్త్ మినిస్టర్ ఒలెగ్ గ్రిడ్నెవ్ తెలిపారు. దేశంలో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ అక్టోబర్ లో స్టార్టవుతుందని ఇంతకుముందే చెప్పారు. వ్యాక్సిన్ తయారీకి అవసరమయ్యే ఖర్చంతా దేశమే భరిస్తోందన్నారు. ‘ప్రస్తుతం చివరి దశ నడుస్తోంది. ఇది చాలా ఇంపార్టెంట్ టైమ్. జనానికి సురక్షితమైన టీకాను అందించాలి. తొలుత సీనియర్ సిటిజన్లు, మెడికల్ సిబ్బందికి టీకాలేస్తాం’ అని చెప్పారు.
నవంబర్ లో వ్యాక్సిన్ ఉత్పత్తి:
వ్యాక్సిన్‌ను గమేలెయ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, రష్యా రక్షణ శాఖ కలిసి అభివృద్ధి చేశాయి. రష్యా ప్రజల్లో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యాక వ్యాక్సిన్ పనితీరును అంచనా వేస్తామన్నారు. వ్యాక్సిన్ తయారీ రెండు రకాలుగా ఉంటుందని, రెండూ కలిపితే ఇమ్యూనిటీ పెరుగుతుందని వివరించారు. టీకా క్లినికల్ ట్రయల్స్ జూన్ 18న ప్రారంభం అయ్యాయని, 38 మంది వాలంటీర్లకు టీకా ఇవ్వగా అందరిలో రోగ నిరోధక శక్తి పెరిగిందని వెల్లడించారు. వ్యాక్సిన్ వేసిన ఫస్ట్ గ్రూప్‌ను జులై 15న, సెకండ్ గ్రూప్‌ను జులై 20న డిశ్చార్జి చేశారు. రష్యాలో మరో కంపెనీ వెక్టార్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయోటెక్నా లజీ కూడా వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తోంది. ఈ సంస్థ వ్యాక్సిన్ ఉత్పత్తి నవంబర్‌లో స్టార్టయ్యే అవకాశం ఉంది.
వ్యాక్సిన్ ట్రయల్స్ అన్నీ పూర్తవ్వాలి: డబ్ల్యూహెచ్‌వో
వ్యాక్సిన్ ట్రయల్స్, డెవలప్‌మెంట్‌కు సంబంధించి రూపొందించుకున్న మార్గదర్శకాలు ఫాలో కావాలని రష్యాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరింది. వ్యాక్సిన్ రెగ్యులేటరీ అప్రూవల్ కోసం వచ్చే వారం అప్లయ్ చేస్తామని రష్యా చెప్పడంతో డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. ట్రీట్‌మెంట్ కోసం బయటకొచ్చే వ్యాక్సిన్ అన్ని ట్రయల్స్ పూర్తి చేసుకోవాలంది. ‘వ్యాక్సిన్ పని చేస్తుంని అనుకోవడానికి, ట్రయల్స్ పూర్తి చేసుకోవడానికి చాలా తేడా ఉంటుంది’ అని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. గమేలెయ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ రెడీ చేస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుత అడ్వాన్స్ డ్ స్టేజ్ లో ఉందని, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పాసవుతుందని రష్యా అధికారులు చెప్పారు.
కరోనా వ్యాక్సిన్‌పై క్లినికల్ ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయని రష్యాలోని ‘సెచెనోవ్ ఫస్ట్ మాస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ’ ప్రకటించింది. ప్రయోగ పరీక్షలు పూర్తిచేసిన తొలి టీకా తమదేనని వెల్లడించింది. గమేలెయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక టీకాపై ఈ వర్సిటీ పరీక్షలు నిర్వహించింది. గమేలియా ఇన్ స్టిట్యూట్ రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను మాస్కోలోని బర్డెన్‌కో మిలటరీ ఆస్పత్రిలో కూడా పరీక్షించారు. ద్రవ రూపంలోని మందును వాలంటీర్లకు ఇచ్చారు.