Russia Ukraine Tensions Air India To Fly Special Flights To Kyiv As Russia Ukraine Tensions Rise
Russia-Ukraine tensions rise : యుక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయులను మన దేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తిరిగి తీసుకొచ్చేందుకు ఎయిరిండియా రంగంలోకి దిగింది. ఎయిరిండియా నుంచి మూడు విమానాలను యుక్రెయిన్‌కు నడుపనున్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 22, 24, 26 తేదీల్లో ఇండియా-యుక్రెయిన్ (బోరిస్పిల్ అంతర్జాతీయ విమానశ్రయం) మధ్య మూడు విమాన సర్వీసులను ఎయిరిండియా నడపనున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఎయిర్ ఇండియా బుకింగ్ ఆఫీసులు, వెబ్‌సైట్, కాల్ సెంటర్, ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుకింగ్స్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా యుక్రెయిన్ నుంచి విమాన సర్వీసులను నడిపేందుకు పౌర విమానయాన శాఖ ఆంక్షలు సడలించింది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ నుంచి విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది. రష్యా యుక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలతో భారత పౌరులు స్వదేశనికి తిరిగి తీసుకురావాలని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది.
యుక్రెయిన్‌లోని భారతీయ పౌరులకు సమాచారం, సాయం అందించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. అదనంగా యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలొ తూర్పు యూరోపియన్ దేశంలోని భారతీయుల కోసం 24 గంటల హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేసింది. రష్యా.. యుక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో దాదాపు లక్ష మంది సైనికులను మోహరించింది.
నౌకాదళ విన్యాసాల కోసం నల్ల సముద్రానికి యుద్ధనౌకలను పంపిన నేపథ్యంలో యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని NATO దేశాలలో ఆందోళనలను రేకెత్తించింది. యుక్రెయిన్‌పై దాడికి యోచిస్తున్నట్టు వస్తున్న వార్తలను రష్యా తీవ్రంగా ఖండించింది.
మరోవైపు.. దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వం కోసం అన్ని దేశాల చట్టబద్ధమైన భద్రతా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని ఉద్రిక్తతలను తక్షణమే తగ్గించేందుకు పరిష్కారాన్ని కనుగొనాలని భారత్ సూచిస్తోందని అధికారి ఒకరు తెలిపారు. 20,000 కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు, జాతీయులు ఉక్రెయిన్‌లోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారని, వారిని క్షేమంగా తిరిగి స్వదేశానికి తీసుకురావాల్సి ఉందని తెలిపారు.
Read Also : Ukraine : యుక్రెయిన్ వీడి ఇండియా రండి.. ఎంబసీ కీలక ప్రకటన