American Airlines: విమానంలో మంటలు.. రెక్కలపైకెక్కి ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులు .. వీడియోలు వైరల్

అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది.

American Airlines

American Airlines: అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయం గేటు వద్ద ల్యాండ్ అయిన విమానంలో మంటలు చెలరేగాయి. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలో మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేటును తెరిచి ప్రయాణికులను బయటకు పంపించారు. దీంతో విమానం రెక్కలపై నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Gold Price: వామ్మో.. గోల్డ్ రేటు లక్ష దాటేస్తుందా..! హైదరాబాద్, విజయవాడలో ఇవాళ్టి ధరలు ఇలా..

కొలరాడో స్ర్పింగ్స్ ఎయిర్ పోర్టు నుంచి డాలస్ ఫోర్ట్ వర్త్ కు బయల్దేరిన అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజిన్ లో వైబ్రేషన్స్ రాడంతో వెంటనే విమానాన్ని డెన్వర్ కు మళ్లించి అత్యవసరంగా దించేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఇంజిన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు అమెరికన్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అయితే, విమాన సిబ్బంది అప్రమత్తమైన ప్రయాణికులను ఎమర్జెన్సీ గేటు ద్వారా.. విమానం రెక్కల పై నుంచి సురక్షితంగా కిందకు దింపారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దింపినట్లు అమెరికా ఎయిర్ లైన్స్ తెలిపింది.

Also Read: Donald Trump: ఈయూకు ట్రంప్ వార్నింగ్.. వీస్కీపై వెనక్కు తగ్గకుంటే.. వైన్ పై 200శాతం.. దెబ్బకు పడిపోయిన షేర్లు

అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే, బోయింగ్ విమానం రెక్కల పైన ప్రయాణికులు నడుస్తూ ఒక చోటకు చేరుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో ప్రయాణికుల్లో కొందరు చేతిలో బ్యాగ్స్ పట్టుకొని ఉన్నారు. విమానం కింద భాగంలో మంటలు కనిపిస్తున్నాయి.


డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి కిందకి దించేందుకు ఇన్‌ఫ్లేటబుల్ స్లైడ్స్‌ను (జారుడు మెట్లు) వాడినట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) తెలిపింది.