సూర్య గ్రహణం.. కేతుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం.. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు గ్రహణాలు సంభవించాయి. వీటిలో రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు. ఈ ఏడాదిలో చివరి గ్రహణం ఇవాళ(2019 డిసెంబరు 26) ఏర్పడుతోంది. ఈరోజు ఏర్పడే కంకణాకార కేతుగ్రస్త గ్రహణం తిరిగి 16 ఏళ్ల తర్వాత సంభవిస్తుంది. సూర్యహణం మార్గశిర బహుళ చతుర్దశి మూల నక్షత్రం ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది.
ఈ సూర్యగ్రహణం గురువారం దేశవ్యాప్తంగా కనిపించనుంది. ఈ ఖగోళ అద్భుతాన్ని చూసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు, వైద్యులు ఇప్పటికే సూచించారు. 99శాతం సూర్యుడి కాంతిని చంద్రుడు అడ్డగించినప్పటికీ మిగిలిన ఒక శాతం వెలుగునైనా నేరుగా చూస్తే రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎలాంటి రక్షణ లేకుండా కొన్ని సెకన్ల పాటు చూసినా ప్రమాదమే. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు వహించాలి. ఈ సూర్యగ్రహణం చాలా ప్రమాదం అని చెబుతున్నారు.
ఈ సూర్యగ్రహణ స్పర్శకాలం ఉదయం 8.03 గంటలు కాగా, మోక్షకాలం ఉ.11.11 గంటలు.. మూడు గంటల పాటు ఉండే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం దేశవ్యాప్తంగా కనిపించనుంది. సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఆలయాలను బుధవారం రాత్రి నుంచి మూసివేశారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అభిషేకం, సంప్రోక్షణ తర్వాత ఆలయాలను పునఃప్రారంభిస్తారు. ధనుస్సు రాశి వారు ఈ గ్రహణం చూడరాదని, ముఖ్యంగా మూల నక్షత్రం వారు ఈ గ్రహణం చూస్తే అనారోగ్య హేతువని జ్యోతిషులు చెబుతున్నారు.
భారత్‌తో పాటు సౌదీ ఆరేబియా, ఖతార్, యూఏఈ తదితర దేశాల్లో కూడా సూర్య గ్రహణం కనిపించనుంది. హైదరాబాద్‌లో గురువారం 9 నుంచి 12.30 గంటల వరకు సూర్యగ్రహణం కనిపిస్తుందని బిర్లా ప్లానిటేరియం డైరెక్టర్ డాక్టర్ బీజీ సిద్ధార్థ్ వెల్లడించారు. 10.45 గంటల సమయంలో 50 నుంచి 60 శాతం సూర్యుడు కనిపిస్తాడని స్పష్టం చేశారు. ఇక ఆస్ట్రేలియా, ఫిలిఫ్పీన్స్, సౌదీ అరేబియా, సింగపూర్‌లలో కూడా ఈ సూర్య గ్రహణం కనిపిస్తోంది.