×
Ad

Afghan Minister: పాకిస్తాన్‌కు షాక్..! భారత పర్యటనలో మరో అఫ్ఘానిస్థాన్ మంత్రి..

భారత దేశ అధికారిక పర్యటనకు వచ్చిన అఫ్ఘన్ పరిశ్రమ, వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీకి హృదయపూర్వక స్వాగతం.

Afghan MinisterL అఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత పర్యటనను విజయవంతంగా ముగించుకున్న విషయం విదితమే. ఇప్పుడు ఆ దేశానికి చెందిన మరో మంత్రి భారత పర్యటనకు వచ్చారు. తాలిబాన్ పాలనలోని పరిశ్రమలు, వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ ఐదు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్నారు. అఫ్ఘనిస్తాన్‌తో కీలక సరిహద్దులను పాకిస్తాన్ మూసివేసింది. ఈ క్రమంలో తాలిబాన్ పాలకులు అత్యవసరంగా కొత్త వాణిజ్య భాగస్వాములు, మార్గాలు వెతుకుతున్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన నిమిత్తం అఫ్ఘన్ వాణిజ్య మంత్రి అజీజీ భారత్ కు వచ్చారు.

ఇటీవల అఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఐదు రోజుల భారత పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ఇది జరిగిన కొన్ని వారాల తర్వాత తాలిబాన్ పాలనలోని పరిశ్రమలు, వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ బుధవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన ఐదు రోజుల పర్యటన కోసం భారత్ కు వచ్చారు.

సరిహద్దు ఘర్షణల తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో పాకిస్తాన్ తన భూ సరిహద్దులను మూసివేసిన తరుణంలో అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ భారత్ కు వచ్చారు. పాక్ చర్యతో అఫ్ఘన్ ఎగుమతులకు (పండ్లు) భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో పాకిస్తాన్ కాకుండా ఇతర దేశాలకు తమ వాణిజ్యాన్ని విస్తరించాలని తమ వ్యాపారులకు తాలిబన్ పాలకులు సూచించారు.

“భారత దేశ అధికారిక పర్యటనకు వచ్చిన అఫ్ఘన్ పరిశ్రమ, వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీకి హృదయపూర్వక స్వాగతం. ద్వైపాక్షిక వాణిజ్యం , పెట్టుబడులు, సంబంధాలను మెరుగుపరచడం ఈ పర్యటన ముఖ్య లక్ష్యం” అని ఢిల్లీ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

బంధం మరింత బలోపేతం..

అజీజీ భారత దేశ పర్యటనతో రెండు దేశాలు తమ ఆర్థిక సంబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ముత్తాకి అక్టోబర్ పర్యటన సందర్భంగా ఖనిజాలు, ఎనర్జీ, మౌలిక సదుపాయాలలో పెట్టుబడి అవకాశాలను అన్వేషించడానికి భారత్- అఫ్ఘనిస్తాన్ ద్వైపాక్షిక వాణిజ్య కమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి. భారత పర్యటనలో భాగంగా అజీజీ వాణిజ్య చర్చల్లో పాల్గొననున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF) కు హాజరు కానున్నారు.

పాకిస్తాన్‌తో తన ప్రధాన దారులను మూసివేయడంతో కాబూల్‌కు ప్రతి నెల మిలియన్ల నష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాల కోసం అప్ఘాన్ చురుగ్గా వెతుకుతోంది. పాకిస్తాన్ వాణిజ్య దారులను మూసివేయడం వల్ల రెండు వైపులా వ్యాపారులు ఇప్పటికే 100 మిలియన్ల డాలర్లకు పైగా నష్టపోయారని అఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ జాయింట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ తెలిపింది.

“మాకు నష్టం కలిగినా పర్లేదు. దేవుడు, దేశం, అమరవీరులు, ఎమిరేట్-షరియా రక్షణ కోసం మేము భరిస్తాము. ఎందుకంటే మాకు వేరే మార్గం లేదు. వ్యాపారులు పాకిస్తాన్ ను దాటి చూడాలి” అని అజీజీ కోరారు.

Also Read: టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య..! షాక్‌లో అభిమానులు.. పోలీసుల అదుపులో బాయ్‌ఫ్రెండ్..