Astronaut Sunita Williams
Astronaut Sunita Williams: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా ఆ ఇద్దరు వ్యోమగాములు ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. వాస్తవానికి వారు తిరిగి భూమిపైకి జూన్ 14న చేరుకోవాల్సి ఉంది. కానీ, తిరుగుప్రయాణంలో వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సాంకేతిక సమస్యలు తలెత్తడం కారణంగా వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. అప్పటి నుంచి ఇద్దరు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్నారు.
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా అనేక ప్రయత్నాలు చేస్తోంది. కానీ, వారి ప్రయత్నాలు విఫలమవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో వారు అంతరిక్షంలోకి వెళ్లి దాదాపు ఏడు నెలలు అవుతుంది. వారిని భూమిపైకి తీసుకొచ్చే విషయంపై ఇటీవల నాసా కీలక ప్రకటన చేసింది. తొలుత వచ్చే ఏడాది మార్చి నెల చివరి నాటికి ఇద్దరు వ్యోమగాములను భూమిపైకి తీసుకొస్తామని తెలిపింది. అయితే, రెండు రోజుల తరువాత.. ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిని చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు భూమిపైకి ఎప్పుడు వస్తారనే అంశంపై స్పష్టమైన క్లారిటీ లేదు. ఈ క్రమంలో వారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక వ్యోమగామి అంతరిక్షంలో ఉన్నప్పుడు అతను అక్కడ ఎన్నిరోజులు జీవించగలుగుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
Also Read: NearEstate New Benchmark : వర్చువల్ రియల్ ఎస్టేట్ అన్వేషణలో నియర్‌ఎస్టేట్ సరికొత్త బెంచ్ మార్క్..!
వ్యోమగామి కొన్ని కారణాల వల్ల అంతరిక్షంలో చిక్కుకుపోతే, అతను ఎంతకాలం జీవించగలడు..? అనే విషయానికి వస్తే.. వ్యోమగామి సునీత విలియమ్స్ ఈ ఏడాది జూన్ నెల నుంచి అంతరిక్షంలో ఉంటున్నారు. అయితే, అక్కడ ఆమె సులభంగా 300 నుంచి 400 రోజులు ఉండగలరు. అంటే, ఆమె మరికొన్ని నెలలు సురక్షితంగానే అంతరిక్ష కేంద్రంలో ఉండొచ్చు. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన రికార్డు రష్యా వ్యోమగామి వాలెరీ పాలియకోవ్ పేరిట ఉంది. అతను 1994 జనవరి నుంచి 1995 మార్చి వరకు దాదాపు 437 రోజులు స్పేస్ స్టేషన్ లో ఉన్నాడు.