శాస్త్రవేత్తలు కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్నారు. ఇది భూమికి 154 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమితో పోలిస్తే దాదాపు రెట్టింపు పరిమాణంలో, నాలుగు రెట్లు ఎక్కువ బరువుతో ఈ గ్రహం ఉంది.
మొరాకోలోని ఉకైమీడెన్ అబ్జర్వేటరీకి చెందిన అబ్‌డెరహ్మన్ సౌబ్‌కియో నేతృత్వంలోని టీమ్.. నాసా ట్రాన్సిటింగ్ ఎక్స్‌ప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) ద్వారా ఈ గ్రహాన్ని గుర్తించారు. TOI-1846 bగా గుర్తింపు పొందిన ఈ గ్రహాన్ని నీరు అధికంగా ఉన్న సూపర్ ఎర్త్ అని చెబుతున్నారు. దీని వయస్సు సుమారు 7.2 బిలియన్ సంవత్సరాలు.
“TOI-1846 bని ట్రాన్సిటింగ్ ఎక్స్‌ప్లానెట్ సర్వే శాటిలైట్ డేటా, భూమిపై నుంచి తీసిన మల్టీకలర్ ఫొటోమెట్రిక్ డేటా, హై రిజల్యూషన్ ఇమేజింగ్, స్పెక్ట్రోస్కోపిక్ పరిశీలనలతో ధ్రువీకరించాం” అని పరిశోధకులు పేర్కొన్నారు.
Also Read: వైభవ్ సూర్యవంశీ త్వరలోనే భారత సీనియర్ జట్టులో ఆడతాడు.. ఎందుకంటే?: రవిశాస్త్రి
ఈ గ్రహం పరిమాణం దాదాపు భూమి పరిమాణం కంటే 1.792 రెట్లు ఎక్కువ. దాని బరువు భూమితో పోలిస్తే 4.4 రెట్లు ఎక్కువ. ఈ గ్రహం ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 568.1 కెల్విన్‌గా శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం TOI-1846 b నీరు అధికంగా ఉండే గ్రహం అని భావిస్తున్నారు. దీని అసలైన నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే రేడియల్ వెలాసిటీ (RV) పరిశీలనలు చేయాలి.
“TOI-1846 bపై RV పరిశీలనలకు ఇది అనుకూలంగా ఉంటుంది. MAROON-X అనే ఇన్‌స్ట్రుమెంట్ సాయంతో ఇది సాధ్యమవుతుంది. TOI-1846 bకి 47 స్కోరు ఉన్న TSM (ట్రాన్స్‌మిషన్ స్పెక్ట్రోస్కోపీ మెట్రిక్) ఉంది. చిన్న సబ్-నెప్ట్యూన్లకు బెంచ్‌మార్క్ 90. దీని కంటే ఇది తక్కువ” అని పరిశోధకులు వెల్లడించారు.
ఈ గ్రహానికి మాతృ నక్షత్రం TOI-1846. ఇది సూర్యుడి పరిమాణంతో పోలిస్తే 0.4 రెట్లు చిన్నది. ఆ నక్షత్ర ఉష్ణోగ్రత సుమారు 3,568 కెల్విన్. దాని వయస్సు 7.2 బిలియన్ సంవత్సరాలు. కాగా, ఇక ఈ ఏడాది ప్రారంభంలో మరో సూపర్ ఎర్త్ గుర్తించిన విషయం తెలిసిందే. దీనికి HD 20794 d అని పేరు పెట్టారు.