Sheikh Hasina : భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, అవామీ లీగ్ అగ్ర నాయకులతో సహా 45మందిపై ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ అరెస్ట్ వారెంట్లను జారీ చేసింది. ఈ మేరకు ట్రిబ్యునల్‌లో ప్రాసిక్యూషన్ రెండు పిటిషన్లను దాఖలు చేసింది. దీనిపై విచారించిన ఛైర్మన్ జస్టిస్ ఎండీ గోలం మోర్తుజా మజుందార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసిందని చీఫ్ ప్రాసిక్యూటర్ ముహమ్మద్ తాజుల్ ఇస్లాం పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది.
వచ్చే నవంబర్ 18లోగా వీరిందరిని అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని సంబంధిత అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఇటీవలే బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలతో తీవ్ర హింసాత్మకంగా మారింది. ఈ నిరసనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ప్రధాని అధికారిక నివాసం నుంచి షేక్ హసీనా పారిపోయి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. బంగ్లాదేశ్ అల్లర్లపై షేక్ హసీనాపై 60 ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై దర్యాప్తును ప్రారంభించిన ఐసీటీ షేక్ హసీనాకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్‌లో ఇటీవల హసీనా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహించిన సామూహిక ఉద్యమంలో హత్యలకు పాల్పడిన వారిని విచారిస్తామని ఆగస్టులో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది. హసీనా ప్రభుత్వ పతనం తరువాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక సంఘటనలలో బంగ్లాదేశ్‌లో 230 మందికి పైగా మరణించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో వివాదాస్పద కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా విద్యార్థుల భారీ నిరసన ప్రారంభమైనప్పటి నుంచి మరణించిన వారి సంఖ్య 600కి పైగా చేరుకుంది.
జులై 15 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు బంగ్లాదేశ్‌లో జరిగిన మారణహోమం, నేరాల ఆరోపణలపై షేక్ హసీనాపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై ట్రైబ్యునల్ దర్యాప్తును ప్రారంభించి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని పేర్కొన్నారు. షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందడాన్ని బంగ్లాదేశ్ విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. షేక్ హసీనా తమకు అప్పగించాలంటూ బీఎన్‌పీని భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
Read Also : Somy Ali: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కి సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు బహిరంగ లేఖ