Afghanistan
Afghanistan : ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల ప్రాబల్యం పెరుగుతోంది. దేశంలోని 430 జిల్లాలను తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా తాలిబన్ల దాడి నుంచి తప్పించుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గానిస్థాన్ లో ఉన్న భారతీయ అధికారులను తీసుకొచ్చేందుకు సిద్దమవుతుంది.
కాబూల్, కాందహార్, మజారే షరీఫ్, తదితరప్రాంతాల్లోని స్టాఫ్ ను, ఇతర సిబ్బందిని ఖాళీ చేయించే యత్నాలు ప్రారంభించామని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. భారతీయ ఎంబసీలు, దౌత్యకార్యాలకు కూడా పనిచేయలేని పరిస్థితి ఏర్పడటంతో అధికారులను వెనక్కి తీసుకురానున్నారు. అమెరికా బలగాలు వెనుదిరగడంతో తాలిబాన్లకు అడ్డేలేకుండా పోయింది. ఇక కొన్ని ప్రాంతాల్లో తాలిబన్లతో అఫ్గాన్ సైనికులు చేతులు కలిపారు.
కాబూల్ లో ఎంబసీ సహా ఆఫ్ఘన్ లో ఇండియాకు నాలుగు దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాలలో స్టాఫ్ అంతా తిరిగి ఇండియాకు వస్తారో లేదా కొంతమంది అక్కడే ఉంటారో తెలియడం లేదు. ఇక ఇప్పటికే రెండు కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రస్తుతం రెండు మాత్రమే పనిచేస్తున్నాయి.. ఈ రెండింటి కార్యకపాలు కూడా రేపు లేదా ఎల్లుండి నిలిచిపోయే అవకాశం ఉంది. మరోవైపు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో తాలిబన్ చట్టాలను అమలు చేస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.