Joe Biden
Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఆయన వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న జో బైడెన్ అధికార పీఠం నుంచి దిగిపోనున్నారు. అయితే, మరో నెలరోజులు అధ్యక్ష పీఠాన్ని వీడనున్న జో బైడెన్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత వారం రోజుల క్రితం యుక్రెయిన్ కు భారీ మొత్తంలో ఆయుధాలను సరఫరా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు తన కుమారుడు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష పెట్టి ఆయనపై ఉన్న పలు కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించిన విషయం తెలిసిందే. బైడెన్ నిర్ణయంపై ట్రంప్ సహా పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా బైడెన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Joe biden: బైడెన్ సంచలన నిర్ణయం.. కుమారుడికి క్షమాభిక్ష.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జోబైడెన్ అనుకూలదారులు, అధికారులు, స్నేహితులను లక్ష్యం చేసుకునే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారట. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలగడానికి ముందే తన హయాంలో తన వర్గీయులుగా ముద్రపడిన అధికారులు, స్నేహితులు, మద్దతుదారుల్లో పలు కేసులను ఎదుర్కొంటున్న కొందరికి క్షమాబిక్ష పెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీనియర్ సహాయకులు, వైట్ హౌస్ లాయర్లతో బైడెన్ చర్చలుసైతం జరిపినట్లు అమెరికాలోని వార్తా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.
బైడెన్ క్షమాభిక్ష పెట్టాలని అనుకునేవారిలో మాజీ ప్రత్యేక సలహాదారు ఆంథోని ఫౌసీ, మాజీ చట్టసభ సభ్యుడు లిజ్ చెనీ, కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ ప్రతినిధి ఆడమ్ షిఫ్, రిటైర్డ్ జనరల్ మార్క్ మిల్లీ తదితరులు ఉన్నారట. ఇప్పటికే తన కుమారుడు హంటర్ కు కేసుల నుంచి ఉపశమనం కల్పించేందుకు క్షమాభిక్ష పెట్టిన బైడెన్.. తన వర్గీయుల్లో మరికొందరికి క్షమాభిక్ష పెట్టేందుకు సిద్ధమవుతుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సైతం తన పదీకాలం పూర్తయ్యే సమయంలో 74 మందికి క్షమాభిక్ష అమలు చేశారని బైడెన్ మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు.