Joe biden: బైడెన్ సంచలన నిర్ణయం.. కుమారుడికి క్షమాభిక్ష.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?
అక్రమంగా ఆయుధం కొనుగోలు, ఆదాయపు పన్ను ఎగవేత ఆరోపణలతో డెలావెర్, కాలిఫోర్నియాలో బైడెన్ కుమారుడు హంటర్ పై కేసులు నమోదయ్యాయి.

Joe biden
Joe biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో నెల రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి వైదొలగనున్నారు. గత నెల ప్రారంభంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తరువాత జో బైడెన్ ఆ పదవి నుంచి దిగిపోనున్నారు. ఈ క్రమంలో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా తుపాకీ కొనుగోలు, ట్యాక్స్ అక్రమాల కేసుల్లో తన కుమారుడు హంటర్ బైడెన్ కు క్షమాభిక్ష ప్రసాదించారు.
Also Read: Guinea: గినియాలో ఘోర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఘర్షణ.. 100 మందికిపైగా మృతి
అక్రమ ఆయుధం కొనుగోలు, ఆదాయపు పన్ను ఎగవేత ఆరోపణలతో డెలావెర్, కాలిఫోర్నియాలో బైడెన్ కుమారుడు హంటర్ పై కేసులు నమోదయ్యాయి. అక్రమ ఆయుధం కొనుగోలు వ్యవహారంలో హంటర్ పై నమోదైన కేసులో ఈ ఏడాది జూన్ లో న్యాయస్థానం ఆయన్ను దోషిగా తేల్చింది. అయితే, ఇప్పటికీ శిక్ష ఖరారు చేయలేదు. దీనిపై అప్పట్లో జో బైడెన్ స్పందిస్తూ.. తీర్పును అంగీకరిస్తున్నట్లు తెలిపాడు. ఈ కేసులో తాను కుమారుడి తరపున క్షమాభిక్ష కోరబోనని అప్పట్లో బైడెన్ వెల్లడించారు. కానీ, బైడెన్ ఇప్పుడు మాట మార్చడం గమనార్హం. అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయే సమయంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది.
అక్రమ ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసుల్లో తన కుమారుడు హంటర్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అమెరికా ప్రజలకు నిజాన్ని చెప్పాలి. నా జీవితం మొత్తంలో నేను పాటిస్తున్న సూత్రం ఇదే. న్యాయశాఖ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోనని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే చెప్పా. ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను. నా కుమారుడు హంటర్ ను అన్యాయంగా విచారించే సమయంలోనూ నేను చూస్తూ ఉండిపోయాను. రాజకీయ కుట్రలో భాగంగానే అతడిపై కేసులు పెట్టారు. ఇక జరిగింది చాలు. ఈ కేసుల్లో అతడికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించుకున్నా. ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’’ అంటూ జో బైడెన్ పేర్కొన్నారు.
జో బైడెన్ నిర్ణయం పట్ల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ స్సందించారు. ఇది న్యాయ విఘాతంగా అభివర్ణించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ట్రూత్ సోషల్’ లో ట్రంప్ పోస్టు చేశారు. ‘‘హంటర్ కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే ఏళ్లుగా జైలులో ఉన్న జే-6 (జనవరి 6న క్యాపిటల్ హిల్ లో ట్రంప్ తరపున అల్లర్లలో పాల్గొన్నవారు) బందీలకు ఎందుకు ఉపశమనం కల్పించలేదు..? తన కుమారుడిని కేసుల నుంచి తప్పించడం పూర్తిగా న్యాయవిరుద్ధం, అధికార దుర్వినియోగం’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
Donald Trump comments on Joe Biden pardoning his son Hunter, says imprisonment of ‘J-6 hostages’ is an ‘abuse and miscarriage of justice’. pic.twitter.com/ia9xZsIDJv
— AZ Intel (@AZ_Intel_) December 2, 2024