అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ను జో బిడెన్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న జో బిడెన్ కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకున్నారు.
ప్రస్తుతం కమలా కాలిఫోర్నియా నుంచి డెమోక్రటిక్ పార్టీ సెనేటర్‌గా ఉన్నారు. కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని ట్విట్టర్ ద్వారా ఖరారు చేసిన జో బిడెన్…తామిద్దరూ కలిసి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించనున్నట్లు చెప్పారు. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు కాగా…ఆమె తండ్రి ఆఫ్రికాలోని జమైకా దేశస్థుడు. కమలా హారిస్ తల్లి శ్యామలా గోపాలన్ 1960లో తమిళనాడు నుంచి వలసవెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు.
డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన కమలా హ్యారిస్‌కు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. కమలా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ సోషల్ మీడియా వేదికగా పలువురు భారత రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు స్పందించారు. భారత నెటిజన్లు సైతం సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. వారిలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. ఇన్‌స్టాగ్రాంలో ఆమె ఫొటోను షేర్ చేసి, ఈ ఎంపిక మహిళలకు గర్వకారణమంటూ ప్రియాంక చోప్రా వ్యాఖ్యానించారు. అన్ని వర్ణాలకు చెందిన మహిళలు, నల్లజాతీయ మహిళలు, దక్షిణాసియా మహిళలు..ఇది మహిళలందరికీ గర్వకారణమైన సందర్భం. ఈ పదవికి పోటీ పడుతోన్న మొదటి భారతీయ, నల్లజాతీయురాలైన కమలా హ్యారిస్ కు అభినందనలు అని ఆమె ప్రశంసించారు.
అమెరికా ఉపాధ్య పదవికి కమలా హారిస్ అభ్యర్థిత్వం తిరుగులేనిదిగా మరో ప్రవాస భారతీయురాలు, చెఫ్, టీవీ హోస్ట్ పద్మాలక్ష్మి పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు పెన్స్, ప్రస్తుత కేబినెట్ మొత్తానికంటే ఆమె ఎంతో తెలివైనదిగా పేర్కొన్నారు.
వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటి వేసే ముందు ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభాన్ని, దీన్ని ఎదుర్కోవడంలో ట్రంప్ యంత్రాంగం(రిపబ్లికన్ పార్టీ) వైఫల్యాలను గుర్తించుకోవాలని పద్మా లక్ష్మి సూచించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరులో జరగనుండగా…నల్లజాతీయులతో పాటు ప్రవాస భారతీయులు కూడా డెమోక్రటిక్ పార్టీ వైపు తిప్పుకునేందుకు కమలా అభ్యర్థిత్వం దోహదపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.