Brazil Corona Deaths
Brazil Corona Deaths : ప్రపంచం అంతా ఓ లెక్క, బ్రెజిల్ లో మాత్రం మరో లెక్క. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి.. బ్రెజిల్ ని మాత్రం బెంబేలెత్తిస్తోంది. ఆ దేశంలో కరోనా సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. ఆ దేశంలో పలు నగరాల్లో గత కొన్ని నెలల నుంచి జననాల కన్నా మరణాల సంఖ్యే ఎక్కువ స్థాయిలో నమోదవుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
రియో డి జానరో నగరంలో గత ఆరు నెలల నుంచి ఇదే సీన్ రిపీట్ అవుతోంది. రియోలో మార్చిలో 36వేల 437 మంది మరణించారు. ఆ నగరంలో ఆ నెలలో పుట్టిన వారి సంఖ్య 32వేల 060గా ఉంది. అంటే ఒక నెలలో జననాల కన్నా మరణాల సంఖ్య 16 శాతం ఎక్కువగా ఉంది. జాతీయ సివిల్ రిజిస్టర్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఒక్క రియో నగరమే కాదు.. ఆ దేశంలో మరో పది నగరాల్లోనూ ఇదే తరహా దుస్థితి. 5 లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో తక్కువ సంఖ్యలోనే జననాలు నమోదు అవుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
పీ 1 వేరియంట్ అక్కడ బీభత్సం సృష్టిస్తోంది. ఆ కొత్త స్ట్రెయిన్ వల్లే ఆ దేశంలో కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ ప్రకారం బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 77వేల 515 మంది కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. 20 లక్షల మంది పాజిటివ్‌గా తేలారు. 27 రాష్ట్రాల్లో దాదాపు 80 శాతం హాస్పిటళ్లు రోగులతో నిండి ఉన్నాయి.