Luiz Inacio Lula da Silva
Brazilian President: బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా గాయపడ్డారు. ఆయన నివాసంలోని బాత్ రూంలో కింద పడటంతో తలకు బలమైన గాయం అయింది. దీంతో అతను రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు రష్యాలోని కజాన్ లో 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతో సహా కూటమిలోని దేశాల అధినేతలు హాజరుకానున్నారు. లూలా డా సిల్వాకు ప్రస్తుతం 78ఏళ్లు. ఈనెల అక్టోబర్ 27వ తేదీన 79వ సంవత్సరంలో అడుగుపెట్టనున్నారు.
Also Read: PM Modi: పుతిన్ ఆహ్వానం.. మరోసారి రష్యా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ..
బ్రెజిల్ అధ్యక్షుడి తలకు బలమైన గాయమైంది. దీంతో రక్తస్రావం కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రష్యాలో జరిగే బ్రిక్స్ సద్ససులో పాల్గొనేందుకు ఆయన విమానంలో ప్రయాణించాల్సి ఉంది. అయితే, దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచనలు చేయడంతో సిల్వా తన రష్యా పర్యటనను వాయిదా వేసుకున్నారు. సిల్వా రష్యా పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు బ్రెజిల్ అధ్యక్ష కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. అయితే, వర్చువల్ గా సమావేశాల్లో పాల్గొనడం జరుగుతుందని ఆ ప్రకటనలో అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లనున్నారు. 2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరిన తరువాత అది బ్రిక్స్ గా మార్చారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా చేరాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో పది దేశాలు ఉన్నాయి.