Brics Summit 2024: ప్రధాని మోదీతో జిన్‌పింగ్ భేటీ..! ఐదేళ్ల తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం

తూర్పు లడఖ్ లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) పై 2020 నుంచి కొనసాగుతున్న వివాదానికి స్వస్తి పలుకుతూ ఇరు దేశాల మధ్య తాజాగా ఓ ఒప్పందం కుదిరింది.

BRICS Summit 2024

Brics summit Bilateral meeting: రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ సదస్సు జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ బ్రిక్ సమ్మిట్ -2024 కోసం రష్యాకు వెళ్లారు. మోదీకి రష్యాలో ఘన స్వాగతం లభించింది. తాను బస చేస్తున్న హోటల్ కు చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు త్రివర్ణ పతాకాలతో సాదర స్వాగతం పలికారు. అక్కడే వారితో కొద్దిసేపు ఆయన సంభాషించారు. కాసేపటి తరువాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా అలింగనం చేసుకున్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా ఈ సమ్మిట్ కు హాజరయ్యారు. అయితే, మోదీ, జిన్‌పింగ్ మధ్య అధికారికంగా ద్వైపాక్షిక భేటీ ఉంటుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ విలేకరులకు ధ్రువీకరించారు.

Also Read: దారుణం.. చైన్ కోసం మహిళను ఎలా ఈడ్చుకెళ్లారో చూడండి.. వెన్నులో వణుకుపుట్టించే వీడియో..

తూర్పు లడఖ్ లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) పై 2020 నుంచి కొనసాగుతున్న వివాదానికి స్వస్తి పలుకుతూ ఇరు దేశాల మధ్య తాజాగా ఓ ఒప్పందం కుదిరింది. చైనా రాయబారులు మంగళవారం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ కీలక గస్తీ ఒప్పందం అమలుకు భారత్ తో కలిసి పనిచేస్తామని చైనా విదేశాంగ మంత్రి లిన్ జియాన్ పేర్కొన్నారు. దీంతో బ్రిక్స్ లో జరిగే ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ల అధికారిక ద్వైపాక్షిక భేటీలో తాజా ఒప్పందంపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Also Read: Cyclone Dana Effect : దానా తుఫాను ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు 4 రోజులు సెలవులు!

గతేడాది 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, జీ జిన్‌పింగ్ మధ్య చివరి భేటీ జరిగింది. దీనికి ముందు 2020 సంవత్సరంలో ఇద్దరు నేతలు జీ-20 సమ్మిట్ లో కలుసుకున్నారు. అయితే, జీ-20 సమ్మిట్ లో ఇద్దరు నేతల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమావేశం జరగలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటున్న సమయంలో మోదీ, జీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఐదేళ్ల తరువాత అధికారికంగా ద్వైపాక్షిక సమావేశం జరిగినట్లవుతుంది.