Cyclone Dana Effect : దానా తుఫాను ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు 4 రోజులు సెలవులు!

Cyclone Dana Effect : దానా తుఫాను ప్రభావంతో ఈనెల 23వ తేదీ నుంచి 26 తేదీ వరకు మొత్తం 4 రోజుల పాటు స్కూళ్లకు సెలవులను ప్రకటించాయి.

Cyclone Dana Effect : దానా తుఫాను ఎఫెక్ట్.. ఈ రాష్ట్రాల్లో స్కూళ్లకు 4 రోజులు సెలవులు!

Cyclone Dana

Updated On : October 22, 2024 / 11:45 PM IST

Cyclone Dana Effect : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడింది. అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి తీవ్ర తుఫానుగా మారనుంది. రాబోయే దానా తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. దానా తుఫాను ప్రభావంతో ఈనెల 23వ తేదీ నుంచి 26 తేదీ వరకు మొత్తం 4 రోజుల పాటు స్కూళ్లకు సెలవులను ప్రకటించాయి.

దానా తుఫాను కారణంగా వచ్చే 3 రోజుల్లో పలు జిల్లాల్లో పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 23 నుంచి 26 వరకు బంగాళాఖాతంలో తుఫాను కారణంగా గంజాం, పూరి, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్, మయూర్‌భంజ్, కియోంజర్, దెంకనల్, జాజ్‌పూర్, అంగుల్, ఖుర్దా, నయాగర్గ్, కటక్ జిల్లాల్లో పాఠశాలలు మూతపడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అధికారిక నోటీసును జారీ చేశారు.

ఒడిశా మాత్రమే కాదు.. పశ్చిమ బెంగాల్‌లోని అనేక జిల్లాల్లో కూడా పాఠశాలలు మూతపడనున్నాయి. ‘దానా’ తుఫాను దృష్ట్యా.. దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు, పుర్బా మేదినీపూర్, పశ్చిమ్ మెదినీపూర్, ఝర్‌గ్రామ్, బంకురా, హుగ్లీ, హౌరా, కోల్‌కతా జిల్లాల్లో అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 26 వరకు పాఠశాలలు మూసివేయనున్నట్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాకుండా, భారత వాతావరణ శాఖ ఆయా ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినట్లు నోటీసులో పేర్కొంది. అక్టోబర్ 26, 27న వారాంతం కావడంతో అక్టోబర్ 28న మళ్లీ స్కూళ్లు రీఓపెన్ అవుతాయని భావిస్తున్నారు.

భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కారణంగా అనేక రాష్ట్రాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. నగరంలో భారీ వర్షాలతో సోమవారం పాఠశాలలను మూసివేయాలని బెంగళూరు ప్రభుత్వం ఆదేశించినట్లు నివేదిక పేర్కొంది. నగరంలో కనీసం 3 గంటలపాటు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

“బెంగళూరు అర్బన్ జిల్లాలో నిరంతర వర్షం కారణంగా, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ప్రైవేట్, ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు అక్టోబర్ 21న సెలవు ప్రకటించారు” అని అధికారిక ప్రకటన తెలిపింది.

Read Also : Mercedes-Benz AMG : భారత్‌కు మెర్సిడెస్ బెంజ్ ఎఎంజీ G63 వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?