చర్చిలో ఉగ్రదాడి: 24మంది మృతి

  • Publish Date - February 17, 2020 / 12:37 PM IST

క్రిస్టియన్లనే లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చేసిన దాడిలో ఆఫ్రికాలోని బుర్కిన ఫోసోలో 24మంది చనిపోయారు. దేశంలోని నార్త్ ప్రాంతంలో.. ఓ చర్చిలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 18 మందికి గాయాలవగా.. మరికొందరిని ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసినట్టు తెలుస్తుంది. 

నార్త్‌ బూర్కినా ఫాసోలోని ఓ గ్రామంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు అక్కడి ప్రాంతీయ గవర్నర్‌ వెల్లడించారు. ఓ సాయుధ ఉగ్రవాదుల గ్రూపు యఘా ప్రావిన్స్‌లోని పాన్సీలోకి ప్రవేశించి  అక్కడి జనంపై దాడులకు తెగబడింది.

ఈ ఘటనలో పాస్టర్‌తో పాటు 24 మంది చనిపోయారని, 18 మంది గాయాపడ్డారని అధికారులు తెలిపారు. సహాయ చర్యలు చేపట్టిన ప్రభుత్వం బుర్కినాఫాసో జిహాదీ ఉగ్రవాదులకు లక్ష్యంగా మారిందని చెబుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన కూడా ఇదే రకంగా ఒక పాస్టర్ ఇంట్లోకి చొరబడి ఏడుగురిని బంధించి ఐదుగురిని చంపేశారు.

ఉగ్రవాదుల దాడుల్లో 2015 నుంచి ఇప్పటివరకు 750 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన వివరాల ప్రకారం.. బుర్కినా ఫాసో, మాలి, నైజర్‌ దేశాల్లో కలిపి గతేడాది 4వేల మంది జిహాదీల దాడుల్లో చనిపోయారు.