China Building Massive Myanmar Border Wall చుట్టు పక్కల దేశాలను తనలో కలుపుకుని అతిపెద్ద దేశంగా అవతరించడమే ప్రధాన లక్ష్యంగా చైనా ముందుకెళ్తోంది. ప్రపంచ దేశాలన్ని చీదరించుకున్నా.. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా డ్రాగన్ దేశం మాత్రం తాను అనుకున్నదే చేస్తుంది. మయన్మార్‌తో దక్షిణ సరిహద్దు వెంబడి 2వేల కిలోమీటర్ల మేర ఇనుప కంచెతో గోడను చైనా నిర్మిస్తున్నట్టు ఇటీవలే బయటపడింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ లో ఉన్న సమయంలో చైనా ఈ గోడ నిర్మాణాన్ని ప్రారంభించిదని… ఇప్పటికే 659కిలోమీటర్ల మేర గోడ నిర్మాణం పూర్తి కూడా అయిందని సమాచారం.
చైనాలోని నైరుతి ప్రాంతంలోని యునాన్ ప్రావిన్స్‌లో ఇరు దేశాలను వేరుచేసేలా ఇనుప కంచెతో 6 నుంచి 9 అడుగుల వెడల్పున్న గోడను నిర్మించినట్టు అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే రేడియో ఫ్రీ ఆసియా తెలిపింది. మొత్తం 2,000కి.మీ పొడవుతో నిర్మించే ఈ గోడను తొలి దశలో 659 కి.మీ ఇప్పటికే పూర్తిచేసినట్టు రేడియో ఫ్రీ ఆసియా తెలిపింది. ఇక, 2022 అక్టోబరు నాటికి ఈ నిర్మాణాన్ని పూర్తిచేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుందని, దీనిపై హై-ఒల్టేజ్ ఫెన్సింగ్, సీసీకెమోరాలు, సెన్సార్లు ఏర్పాటుచేయనున్నట్టు పేర్కొంది.
కాగా, చైనా తీరుపై మయన్మార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గోడ నిర్మాణం గురించి మాయన్మార్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే చైనా దుందుడుకు వైఖరి ప్రదర్శించినట్టు ఆ దేశానికి చెందిన ఇర్రావాడీ న్యూస్ సైట్ తెలిపింది. చైనా వైఖరిని ఖండిస్తూ మయన్మార్ ఆర్మీ అధికారులు.. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇరు దేశాల మధ్య 1961లో కుదిరిన సరిహద్దు ఒప్పందం గురించి ఆ లేఖలో మయన్మార్ అధికారులు ప్రస్తావించారు. దీని ప్రకారం సరిహద్దుకు ఇరువైపులా 10 మీటర్ల వరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టంగా ఉన్నట్లు పేర్కొంది. తన చర్యలతో చైనా తాజాగా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆ లేఖలో మయన్మార్ పేర్కొంది. ఈ నెల 13 నుంచే చైనా ముళ్ల కంచె వేయడం ప్రారంభించినట్లు మయన్మార్ మీడియా చెబుతోంది.
అయితే చైనా మాత్రం ఈ గోడ నిర్మాణాన్నిసమర్థించుకుంటోంది. కరోనా వైరస్ నేపథ్యంలో మయాన్మార్ నుంచి అక్రమచొరబాటు దారుల్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని, అందుకే దీని నిర్మాణం చేపట్టామని చైనా..తన అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ద్వారా ప్రకటించింది. చైనాలోని నైరుతి ప్రాంతంలోని యునాన్ ప్రావిన్స్‌లో 9 మీటర్ల ఎత్తుతో ఈ గోడను నిర్మిస్తున్నట్లు గ్లోబల్ టైమ్స్ చెబుతోంది.
మరోవైపు, మయన్మార్ సరిహద్దులో చైనా చేపడుతున్న గోడ నిర్మాణం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చైనా వాదనలతో ఏకీభవించడంలేదు. తిరుగుబాటుదారులు దేశసరిహద్దు దాటకుండా నిర్బంధించడానికే ప్రభుత్వం పూనుకుందని ప్రభుత్వ వ్యతిరేకులు చెబుతున్నారు. అయితే, భారీ గోడను నిర్మించాలనే నిర్ణయం ఒక్క రోజులో తీసుకుంది కాదని, పక్కా వ్యూహంతోనే చైనా ముందుకెళ్తోందని మాయన్మార్-చైనా సంబంధాల అధ్యయనకర్త వ్యాఖ్యానించారు. వ్యాపారాల నిమిత్తం తరుచూ మాయన్మార్, వియత్నాంలను సందర్శించే చైనా పౌరులకు ఇది ఇబ్బందిగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ గోడపై అమెరికా కూడా ఆందోళన వ్యక్తం చేసింది. విస్తరణవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా కారణంగా రానున్న రోజుల్లో ఇది దక్షిణాసియా ప్రాంతంలో మరిన్ని వివాదాలకు దారి తీసే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. మయన్మార్ ఆక్రమణే డ్రాగన్ ప్రధాన ఉద్దేశం అని అమెరికా అత్యున్నత థింక్ ట్యాంక్ వెల్లడించింది