బంపర్ ఆఫర్.. పిల్లలను కంటే డబ్బులే డబ్బులు..! రెండో బిడ్డకు రూ.6లక్షలు.. మూడో బిడ్డకు రూ.12లక్షలు..

రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ మంది పిల్లలను కనే తల్లిదండ్రులకు ప్రత్యేక పథకాలు అమలు చేసేందుకు సిద్ధమవుతుంది.

China government

China population: ప్రపంచంలో పలు దేశాల్లో జనాభా రోజురోజుకు తగ్గిపోతుంది. వివాహం పట్ల యువతలో విముఖత, వివాహం చేసుకున్నా పిల్లలను కనేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో పుట్టే పిల్లల సంఖ్య క్రమంగా పడిపోతోంది. మన పొరుగు దేశం చైనా ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొంటుంది. కొన్నేళ్ల వరకు జనాభా తగ్గించేందుకు చర్యలు తీసుకున్న చైనా.. ఇప్పుడు జనాభాను పెంచుకునేందుకు నానా తంటాలు పడుతోంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ముగ్గురు పిల్లలను కనాలంటూ చైనా ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తోంది. అందుకోసం దండిగా డబ్బులు ఇస్తామని, పిల్లల చదువు కోసం ప్రత్యేక స్కీంలు అమల్లోకి తీసుకొస్తామని చెబుతుంది.

డబ్బులే డబ్బులు..
రెండో బిడ్డను కన్న తల్లిదండ్రులకు రూ.50వేలు యువాన్లు (దాదాపు రూ.6లక్షలు), మూడో బిడ్డను కన్న వారికి లక్ష యువాన్లు (రూ.12లక్షలు) ఇస్తామని చైనాలో ఇన్నర్ మంగోలియా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చైనాలోని పలు రాష్ట్రాలు పిల్లల్ని కనే జంటలకు ఇప్పటికే నగదు ప్రోత్సాహకాలు, గృహ నిర్మాణానికి సబ్సిడీలను ప్రకటించాయి.

కేంద్రం కూడా రంగంలోకి..
రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ మంది పిల్లలను కనే తల్లిదండ్రులకు ప్రత్యేక పథకాలు అమలు చేసేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. పుట్టే ప్రతీ శిశువుకూ ప్రతీయేటా 3,600 యువాన్ల (దాదాపు రూ. 43వేలు) చొప్పున మూడేళ్ల పాటు ఇచ్చేలా పథకాన్ని రూపొందించినట్లు, త్వరలో దాన్ని అమల్లోకి తెచ్చేందుకు చైనాలోని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పెరుగుతున్న వృద్ధుల సంఖ్య..
చైనాలో కొన్నేళ్లుగా జననాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో ఆ దేశంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఉద్యోగాలు, పనులు చేయగల వయస్కుల సంఖ్య క్రమేణా తగ్గుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే 50యేళ్లలో చైనా జనాభా ఏకంగా 80కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్య సమితి జనాభా అంచనాల విభాగం అంచనా వేసింది. ఇదే జరిగితే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాకు తీవ్ర నష్టదాయక పరిణామం. దీంతో చైనాలోని రాష్ట్ర ప్రభుత్వాలే కాక.. ఏకంగా కేంద్ర ప్రభుత్వంసైతం చైనాలో జననాల సంఖ్య పెరిగేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.