డ్రాగన్ అత్యుత్సాహం : కరోనా సోకిన ట్రంప్‌పై చైనా ఎగతాళి..!

President Donald Trump : ప్రపంచాన్ని కరోనా సంక్షోభంలోకి నెట్టింది చైనానే అంటూ మొదటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తూనే ఉన్నారు. చైనా (China) వైరస్ అంటూ ట్రంప్ ఆభివర్ణించిన సందర్భాలు అనేకం కూడా.. కరోనాకు చైనా బాధ్యత వహించాలని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) తీరుపై కూడా ట్రంప్ మండిపడ్డారు. చివరకు ట్రంప్ కరోనా (Covid-19 positve) బారినపడ్డారు. డ్రాగన్ కు టైం వచ్చింది.. ట్రంప్‌పై అత్యాత్సాహాన్ని వెల్లగక్కింది. ట్రంప్ దంపతులకు కరోనా సోకడంపై వ్యంగ్యాస్త్రాలను సందిస్తోంది. ఒక చైనానే కాదు.. జపాన్ వంటి దేశాలు కూడా తమదైన శైలిలో కామెంట్లతో ట్రంప్ ను ఎగతాళి చేస్తున్నాయి.
కరోనాకు తామే కారణమని పదేపదే ట్రంప్ ప్రస్తావించడాన్ని జీర్ణించుకోలేని చైనీయులు ఇప్పుడు ఆయనపై కామెంట్లతో రెచ్చిపోతూ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే చైనా అధికారిక మీడియా కూడా ట్రంప్ కు కరోనా సోకిందంటూ ప్రసారం చేసింది. చైనా వార్తాపత్రిక గ్లోబల్ టైమ్స్ కూడా ట్రంప్ విషయంలో తమ అక్కసును వెళ్లగక్కింది.
కరోనా వైరస్ పరిస్థితిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసినందుకు ట్రంప్ దంపతులు తగిన మూల్యం చెల్లించారంటూ ట్విటర్లో పేర్కొంది. డ్రాగన్ మీడియానే కాదు.. చైనీయులు కూడా ట్రంప్‌కు కరోనా సోకడంపై హాస్యాస్పదంగా కామెంట్లు చేస్తున్నారు. వీబో యాప్ ద్వారా ట్రంప్ కరోనాకు సంబంధించి తెగ వెతికేస్తున్నారంట.. ట్రంప్‌ను ఎగతాళి చేస్తూ కామెంట్లు చేస్తున్నారంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. చైనా ప్రభుత్వం మాత్రం ట్రంప్‌కు కరోనా సోకిన విషయంపై అధికారికంగా స్పందించలేదు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడికి వైరస్ సోకడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లన్నీ డీలా పడ్డాయి. మదుపరులు ఆందోళనలో పడ్డారు.. తమ పెట్టుబడులపై డైలమాలో ఉండిపోయారు. దీంతో స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాతోపాటు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాట పట్టాయి. కరోనా వైరస్ సోకిందని ట్రంప్ ప్రకటించగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra modi) స్పందించారు. మిత్రుడు ట్రంప్, ఆయన సతీమణి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.