Gold and Silver Underwater : సముద్ర గర్భంలో బంగారం, వెండి ఖజానా..! చైనా శాస్త్రవేత్తల సంచలన ఆవిష్కరణ.. దీని విలువ ఎంతంటే?

Gold and Silver Underwater : సముద్రగర్భంలోని హైడ్రోథర్మల్ ఫీల్డ్‌లో ఈ విలువైన ఖనిజాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సముద్రపు అడుగుభాగంలోని రంధ్రాల నుంచి అత్యంత వేడి, ఖనిజాలతో కూడిన నీరు బయటకు వచ్చే ప్రాంతాలను హైడ్రోథర్మల్ ఫీల్డ్స్‌గా పిలుస్తారు. ఇక్కడ లభించిన ఖనిజాల్లో విలువైన లోహాల శాతం అసాధారణంగా ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమిక విశ్లేషణల్లో తేలింది.

Gold and Silver Underwater

Gold and Silver Underwater : పశ్చిమ పసిఫిక్ సముద్రంలో భారీ స్థాయిలో బంగారం, వెండి సమృద్ధిగా ఉన్న సముద్రగర్భ ఖనిజ నిక్షేపాన్ని కనుగొన్నట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. చైనాలోని సింఘువా యూనివర్సిటీ, షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ సహా పలు సంస్థల పరిశోధకులు ‘జియాంగ్ యాంగ్ హాంగ్ 10’ అనే నౌకలో ఈ యాత్రను చేపట్టారు. సేకరించిన నమూనాలను నౌకలోని ల్యాబ్ లోనే విశ్లేషించగా ఆశ్చర్యపరిచే ఫలితాలు వచ్చాయి.

Also Read : Gold And Silver Rates Today : పండుగ వేళ మహిళకు శుభవార్త.. భారీగా పతనమైన బంగారం ధర.. తులం రేటు ఎంతంటే?

సముద్రగర్భంలోని హైడ్రోథర్మల్ ఫీల్డ్‌లో ఈ విలువైన ఖనిజాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సముద్రపు అడుగుభాగంలోని రంధ్రాల నుంచి అత్యంత వేడి, ఖనిజాలతో కూడిన నీరు బయటకు వచ్చే ప్రాంతాలను హైడ్రోథర్మల్ ఫీల్డ్స్‌గా పిలుస్తారు. ఇక్కడ లభించిన ఖనిజాల్లో విలువైన లోహాల శాతం అసాధారణంగా ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమిక విశ్లేషణల్లో తేలింది.

భూమిపై లభించే ఖనిజ నిక్షేపాలతో పోలిస్తే ఈ ప్రాంతంలోని బంగారం, వెండి సాంద్రతలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీటీవీ తెలిపింది. బంగారం గరిష్ఠంగా ఒక టన్ను ఖనిజంలో 15.4 గ్రాముల వరకు ఉండగా, వెండి గరిష్ఠంగా ఒక టన్నుకు 1.27 కిలోగ్రాముల వరకు ఉన్నట్లు ప్రాథమిక విశ్లేషణల్లో తేలింది.

అయితే ఈ ప్రాంతం కేవలం ఖనిజ సంపద పరంగానే కాకుండా శాస్త్రీయంగా కూడా ఎంతో కీలకమని సింఘువా యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఓషన్ ఇంజినీరింగ్ వైస్ డీన్, పరిశోధన బృందంలోని ప్రముఖ శాస్త్రవేత్త సాంగ్ షిజీ తెలిపారు. చురుకుగా ఉన్న హైడ్రోథర్మల్ ఫీల్డ్‌లో సముద్రపు లోతుల్లోని తీవ్రమైన పరిస్థితులకు అనుగుణంగా జీవించే ప్రత్యేక జీవ సముదాయాలు ఉన్నట్లు గుర్తించారు. అత్యంత కఠినమైన వాతావరణంలో జీవం ఎలా మనుగడ సాగిస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ ప్రాంతం కీలకమైన సమాచారాన్ని అందించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ప్రస్తుత పరిశోధనకు ముందు శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో డజనుకు పైగా ప్రాథమిక సర్వేలు నిర్వహించారు. 700 నుంచి 1,500 మీటర్ల లోతులో డజన్ల కొద్దీ అధిక ఉష్ణోగ్రత కలిగిన హైడ్రోథర్మల్ వెంట్స్‌ను గత పరిశోధనల్లో గుర్తించారు. అక్కడి నుంచి వెలువడే ద్రవాల ఉష్ణోగ్రత 315 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉన్నట్లు తేలింది.

ఈ పరిశోధనల ఆధారంగా ప్రస్తుతం కొత్తగా, అత్యంత భారీగా ఉన్న హైడ్రోథర్మల్ ఖనిజ ప్రాంతాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నిక్షేపంలో మూడు భారీ కోన్ ఆకారంలో ఉన్న సల్ఫైడ్ పర్వతాలు ఉన్నట్లు తెలిపారు.

మూడు పెద్ద శంఖాకార నిర్మాణాలతో ఉన్న ఈ ఖనిజ క్షేత్రం భవిష్యత్తులో ప్రపంచస్థాయి సముద్రగర్భ నిక్షేపంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండితోపాటు రాగి, ఇనుము, జింక్ వంటి ఇతర కీలక ఖనిజాలు కూడా ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఈ నిక్షేపాల పూర్తిస్థాయి పరిమాణం, ఆర్థిక ప్రయోజనాలను అంచనా వేయడానికి 2027లో మరింత కచ్చితత్వంతో కూడిన సర్వేలు చేపట్టాలని చైనా యోచిస్తోంది.