Pakistan : బ్రిక్స్ కూటమిలో చేరేందుకు పాకిస్థాన్ తహతహ.. మూడేళ్ల క్రితమే దరఖాస్తు.. అయినా నో చాన్స్.. భారతే అడ్డంకా..! అసలు కథ ఇదే..
Pakistan BRICS Membership Bid Stalled : బ్రిక్స్ కూటమిలో చేరేందుకు పాకిస్థాన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు.
Pakistan PM Shehbaz Sharif
Pakistan BRICS Membership Bid Stalled : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు భారతదేశంలో జరుగుతుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, చైనా ప్రెసిడెంట్ షీ జిన్‌పింగ్ తోపాటు బ్రిక్స్ కూటమిలో సభ్యత్వ దేశాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే, ఈ కూటమిలో పాకిస్థాన్ దేశానికి సభ్యత్వం లేదు. బ్రిక్స్‌లో చోటు సంపాదించాలని పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2023లోనే ఈ కూటమిలో చేరేందుకు అధికారికంగా దరఖాస్తు చేసుకున్న ఆ దేశం.. రష్యా, చైనా మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. కానీ, ఇప్పటి వరకు సాధ్యం కాలేదు.
Also Read : Xi Jinping In India : ఏడేళ్ల తరువాత భారత్ గడ్డపై అడుగుపెట్టిన చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్..
బ్రిక్స్ కూటమిలో చేరేందుకు పాకిస్థాన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు. బ్రిక్స్ ఆధ్వర్యంలోని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌లోనూ పెట్టుబడి పెట్టింది. అయినప్పటికీ పాకిస్థాన్ ఇప్పటికీ బ్రిక్స్ కూటమికి వెలుపలే ఉంది. ముఖ్యంగా భారత్ వ్యతిరేకత పాకిస్థాన్ సభ్యత్వానికి అతిపెద్ద అడ్డంకిగా మారిందని చెబుతున్నారు.
వాస్తవానికి.. బ్రిక్స్ కూటమిలో చేరేందుకు పాకిస్థాన్ దరఖాస్తు సమర్పించిన తర్వాత బ్రిక్స్ గణనీయంగా విస్తరించింది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూటమిలో చేరాయి. దీంతో బ్రిక్స్ ‘బ్రిక్స్+’గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సుమారు 49 శాతం మందికి, కొనుగోలు శక్తి సమానత్వం (PPP) ప్రాతిపదికన ప్రపంచ జీడీపీలో దాదాపు 40 శాతానికి బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోంది. కానీ, పాకిస్థాన్ దరఖాస్తు మాత్రం పెండింగ్ లో ఉంది. దీనికి ప్రధాన కారణం ఈ కూటమిలో భారత్ కు ఉన్న ‘వీటో’ అధికారమేనని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.
పాకిస్థాన్ దేశం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే, బ్రిక్స్ కూటమిలో చేరడం ద్వారా కొత్త ఆర్థిక, రుణ, పెట్టుబడి అవకాశాలు లభిస్తాయని ఆ దేశం భావిస్తోంది. పాకిస్థాన్ ఎకనామిక్ సర్వే ప్రకారం.. ఆ దేశ జీడీపీ వృద్ధి 3.70 శాతంగా ఉంది. ఈ పరిస్థితుల్లో బ్రిక్స్ కూటమిలో చేరడం ద్వారా తన ఆర్థిక వనరులను విస్తరించుకోవడంతో పాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వంటి సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే బ్రిక్స్ ఆధ్వర్యంలోని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్‌లో పాకిస్థాన్ 580 మిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేసినట్లు సమాచారం.
మరోవైపు బ్రిక్స్ సభ్య దేశాలతో భారత్ వాణిజ్యం కూడా భారీగా పెరిగింది. బ్రిక్స్ దేశాలకు భారత్ ఎగుమతులు 64.3 బిలియన్ డాలర్ల నుంచి 95.7 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే 48.8 శాతం వృద్ధి నమోదైంది. కొంతమంది బ్రిక్స్ సభ్య దేశాల నుంచి మద్దతు లభిస్తున్నప్పటికీ.. కొత్త సభ్యుడిని చేర్చుకోవాలంటే ప్రస్తుత సభ్య దేశాల ఏకాభిప్రాయం తప్పనిసరి కావడంతో పాకిస్థాన్ ప్రవేశం ఇంకా నిలిచిపోయింది. దీంతో పాకిస్థాన్ బ్రిక్స్ సభ్యత్వ ప్రయత్నాల్లో భారత్ వైఖరి అత్యంత కీలకంగా మారింది.
