Climate Change..makes Finding Food Hard For Seabirds
Climate Change..Makes Finding Food Hard for Seabirds : ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని కారణంగా కుంభవృష్టి, వరదలు, అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు, కరవు వంటివి తరచూ ఏర్పడుతున్నాయి. ఎక్కడికక్కడ ప్రకృతి వైపరీత్యాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. మనం చేసిన తప్పులకు మూగజీవాలు కూడా ప్రమాదం బారిన పడుతున్నాయి. ప్రధానంగా సముద్ర పక్షులకు ఆహారం దొరకడం కష్టతరంగా మారుతోంది. శాస్త్రవేత్తల అధ్యయనాల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూస్తున్నాయి.
వాతావరణ మార్పులతో ఇంకాస్త ఎండ పెరుగుతుంది..! వరుణుడు ఇంకొంచెం ఓవర్ డ్యూటీ చేస్తాడు..! అంతకుమించి ఏముంటుందిలే అనుకుంటున్నారా..! అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. మన ఊహలకు అందని విపత్తులు ముంచుకొస్తున్నాయి. మెల్లమెల్లగా అన్నీ దేశాల్లోనూ ప్రకృతి వైపరీత్యాలు సర్వ సాధారణంగా మారుతున్నాయి. ఇటు మానవుడి మనుగడతో పాటు అటు మూగజీవాల మనుగడను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రభావం మొదలైపోయింది. ప్రధానంగా ఈ వాతావరణ మార్పులు సముద్ర పక్షులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. క్లైమేట్ చేంజ్ సముద్ర పక్షులకు ఆహారం దొరకడాన్ని కష్టతరంగా మార్చేస్తోంది.
Also read : China Space Breeding : అంతరిక్షం నుంచి విత్తనాలు తెస్తున్న చైనా..పంట దిగుబడి భారీగా పెంచటానికి యత్నాలు
ఐర్లాండ్ తీరంలో ఉన్న లిటిల్ సాల్టీ అనే చిన్న ద్వీపంలో సముద్ర పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడి పక్షులకు ఒకప్పుడు చాలా సులభంగా ఆహారం దొరికేది. కానీ ఇప్పుడు సముద్రం లోతులకు వెళ్తే కానీ ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. దీనిపై అధ్యయనం చేసేందుకు పరిశోధకులు పక్షుల రెక్కలకు చిన్న ట్రాకర్లను జోడించారు. డేటాబేస్‌లను ఉపయోగించి 5,000 కంటే ఎక్కువ డైవ్‌లను రికార్డ్ చేశారు. సముద్రపు నీటి ఉపరితలంపైకి చేపలు రానప్పుడు… ఆహారం కోసం పక్షులు సముద్రం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. తగినంత సూర్యకాంతి నీటిలోకి ప్రసరిస్తే కానీ.. పక్షులు తమ వేటను కొనసాగించలేవు. అయితే గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూ ఉపరితలం బాగా వేడెక్కుతోంది. సముద్రపు నీరు ఈ వెచ్చదనానికి ఆటోమేటిక్‌గా స్పందిస్తుంది. దాని కారణంగా సముద్రంపై ఎప్పుడూ నల్ల మబ్బులు కమ్ముకునే ఉంటాయి. ఆ సమయంలో నీటిలోకి సూర్యుడి వెలుతురు ప్రసరించే అవకాశం ఉండదు. దీంతో పక్షులు ఆహారం కోసం తమ ప్రాణాలు పణంగా పెట్టే పరిస్థితులు తలెత్తాయి.
స్కూల్ ఆఫ్ బయోలాజికల్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ ఎర్త్ సైన్సెస్‌లోని సముద్ర పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు జరిపారు. వీరి అంచనా ప్రకారం భవిష్యత్తులో మన భూ వాతావరణంలో ఊహకందని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇది సముద్ర జీవులతో పాటు వాటినే ఆహారంగా తీసుకుని బతికే సముద్ర పక్షులపైనా తీవ్ర ప్రభావం చూపించనున్నాయి. కొంతకాలానికి సముద్ర పక్షులకు పూర్తిగా ఆహారం దొరకకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఆ పక్షులకు ఆహారం కావాలంటే కచ్చితంగా చూపు, దూకుడుగా ఎగిరే సామర్థ్యం కలిగి ఉండాలి. సముద్రంపై సూర్య కిరణాలే పడనప్పుడు ఇక అవి లోపలికి దూసుకుపోయి వేటాడడం కష్టం. దాని కోసం ప్రయత్నించినా అవి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు. అందులోనూ బలహీనంగా ఉన్న పక్షలు సముద్రం లోపలికి డైవ్ చేస్తే తిరిగి పైకి రాలేవు. ఏదేమైనా ఈ వాతావరణ మార్పులు సముద్ర పక్షులకు పెద్ద కష్టాన్నే తీసుకొచ్చాయి.