కరోనా : హుబెయ్ ప్రావిన్స్‌‌లో ఏం జరుగుతోంది

  • Publish Date - February 9, 2020 / 08:14 AM IST

కరోనా వైరస్‌తో తీవ్రంగా ప్రభావితమైన హుబెయ్ ప్రావిన్స్ ఇప్పటికీ దిగ్బంధంలోనే ఉంది. చైనా ప్రభుత్వం వైద్య సిబ్బందిని తప్ప ఎవరినీ లోపలకు వెళ్లనివ్వడం లేదు. బయటకు రానివ్వడం లేదు. దీంతో లోపల పరిస్థితేంటన్నది ఎవరికీ తెలియడం లేదు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న సుమారు 50 మంది సిబ్బందిలో కూడా ఈ రోగ లక్షణాలు కనిపించడంతో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది.

రోజుకు 3 నుంచి 4 వేల మంది కరోనా వైరస్‌తో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఇటు ఇప్పటికే రోజుల వ్యవధిలోనే భారీ ఆసుపత్రిని నిర్మించిన చైనా తాజాగా 15 వందల పడకలతో వుహాన్‌లో మరో ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది. రోగుల సంఖ్య పెరుగుతుండటంతో మరిన్ని హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది.
 

ఇదిలా ఉంటే…
జపాన్‌ క్రూయిజ్‌ షిప్‌ డైమెండ్‌ ప్రిన్సెస్‌లోని 3 వేల 711 మంది ప్రయాణికుల్లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొదట 23 మందికి వైరస్ సోకిందని గుర్తించగా… తాజాగా మరో 41మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో నౌకలో చిక్కుకున్న మిగిలిన వారు భయంతో వణికిపోతున్నారు. యొకోహోమా తీరంలో ఈ నౌకను నిలిపివేసిన జపాన్ ప్రభుత్వం వైరస్ భయంతో వారిని బయటకు రానివ్వడం లేదు. షిప్‌లోనే వైద్యం అందిస్తోంది.

దీంతో మిగిలిన వారు ఇది తమకు ఎక్కడ సోకుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు. ఈ నౌకలో దాదాపు రెండు వందల మంది భారతీయులు చిక్కుకుపోయారు. తమను వెంటనే కాపాడాలని కోరుతూ ఓ భారతీయుడు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. షిప్‌ నుంచి తమను తరలించి వేరే చోట ఎక్కడైనా ఉంచాలని  ప్రయాణికులు కోరుతున్నారు. 

811 మంది బలి
ఇక కరోనా వైరస్‌తో చైనాలో మరణమృదంగం కొనసాగుతోంది. ఈ వైరస్‌ బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఒక్కరోజే 89 మంది ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి తీవ్రతను అర్థమవుతోంది. ఇప్పటివరకూ కరోనా 811 మందిని బలితీసుకుంది. సుమారు 35 వేల మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. 06 వేల మందికి పైగా బాధితుల పరిస్థితి విషమంగా ఉందని చైనా అధికారులు ప్రకటించారు.