కరోనా.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. 200కు పైగా దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. లక్షలాది మందిని మంచాన పడేసింది. వేలాది మందిని
కరోనా.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్. 200కు పైగా దేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. లక్షలాది మందిని మంచాన పడేసింది. వేలాది మందిని బలితీసుకుంది. ఎప్పుడు ఎటువైపు నుంచి అటాక్ చేస్తుందో తెలియదు. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. కాగా, కరోనా వైరస్ మహమ్మారి గురించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వైరస్ రూపం ఏంటి? ఎలా వ్యాపిస్తుంది? ఎన్ని రోజులు బతుకుంది? ఏయే ప్రదేశాల్లో మనగలుగుతుంది? ఎలా రూపు మార్చుకుంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగానే కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. కరోనా వైరస్ ప్రయాణం చేయగలదని, ఎగరగలదని తేలింది.
13 అడుగుల దూరం ప్రయాణిస్తుంది, 8 అడుగల ఎత్తువరకు వ్యాపిస్తుంది:
సామాజిక దూరం వల్ల కొవిడ్-19 వైరస్ సోకకుండా నియంత్రించడం సాధ్యమా అనే అంశంపై చైనా పరిశోధకులు స్టడీ చేశారు. ఇందులో షాకింగ్ విషయాలు తెలిశాయి. కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్ 13అడుగుల దూరం(4 మీటర్లు) వరకు ప్రయాణించగలదని, 8 అడుగుల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. చైనా పరిశోధకులు చేసిన ప్రాథమిక విచారణ ఫలితాలను అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెలువరించే ఎమర్జింగ్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ లో పబ్లిష్ చేశారు. బీజింగ్ లోని అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్ కు చెందిన బృందం వుహాన్ లోని హ్యూషెన్ షన్ ఆసుపత్రిలోని ఐసీయూ, సాధారణ కొవిడ్-19 వార్డుల్లో భూ ఉపరితలం, గాలిలోని నమూనాలను పరీక్షించి చూశారు.
వైద్యసిబ్బంది బూట్లు, కంప్యూటర్లు, మౌస్ లు, పడకలు, తలుపు గడియలపై కరోనా వైరస్:
ఫిబ్రవరి 19 నుంచి మార్చి 2 మధ్య కరోనా రోగులను ఉంచిన ఐసీయూ విభాగాలను పరిశీలించారు. 24మంది రోగులపై పరిశోధన చేశారు. వైరస్ అత్యధిక మోతాదులో వార్డుల్లోని నేలపై పేరుకున్నట్లు వీరి అధ్యయనంలో తేలింది. ఐసీయూలో పని చేసే వైద్యసిబ్బంది బూట్లు, కంప్యూటర్లు, మౌస్ లు, పడకలు, తలుపు గడియలపై ఎక్కువ వైరస్ కనిపించినట్లు తెలిపారు. గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి (ఏరోసోల్ ట్రాన్స్ మిషన్)పైనా ఈ టీమ్ అధ్యయనం చేసింది. దగ్గు, తుమ్ముల సమయంలో వెలువడే వైరస్ తో నిండిన తుంపర్లు రోగికి చుట్టూ కిందివైపు 13 అడుగుల దూరం వరకు కేంద్రీకృతమైనట్లు, కొంత పరిమాణం ఎనిమిది అడుగుల ఎత్తువరకు విస్తరించినట్లు కనుగొన్నారు.
మనిషికి మనిషికి మధ్య దూరం 2 మీటర్లు సరిపోదు, 4 మీటర్లు ఉండాల్సిందే:
ఇప్పటికే కరోనా వైరస్ గురించి అనేక భయాలు వెంటాడుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు కరోనా వైరస్ కదులుతుంది, ఎగురుతుంది అనే విషయం మరింత కంగారు పెడుతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో సోషల్ డిస్టేన్స్ పాటించాలని, మనిషికి మనిషికి మధ్య కనీసం 2 మీటర్ల భౌతిక దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన సంగతి తెలిసిందే. అయితే, తాజా సర్వేలో ఆ దూరం సరిపోదని తేలింది. మనిషికి మనిషికి మధ్య కనీసం 4 మీటర్ల దూరం పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు.
సామాజిక దూరం పాటించినంత మాత్రాన సేఫ్ కాదు:
కరోనా వైరస్ అంచనా వేసిన దూరం కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తోందని వెలుగు చూడటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక దూరం పాటిస్తున్నాం.. మనం సేఫ్ అనుకుంటే పొరపాటే అని నిపుణులు అంటున్నారు. మీకు తెలియకుండా వైరస్ గాల్లో ఎగురుతూ రోగి నుంచి మీలోకి చేరొచ్చన్నారు. ఈ పరిస్థితుల్లో ఇతరులకు వీలైనంత దూరంగా ఉంటూ జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా తుమ్ములు, దగ్గుతో బాధపడే వారికి సమీపంలో ఉండకపోవడమే ఉత్తమం అంటున్నారు.