కరెన్సీని కాల్చేసిన కరోనా భయం..డబ్బుని ఓవెన్‌లో పెట్టి బేక్ చేసిన మహిళ

  • Publish Date - March 5, 2020 / 05:28 AM IST

కరోనా వైరస్ ఫోన్ స్క్రీన్లపైనే కాకుండా కరెన్సీ నోట్లకు కూడా పాకుతుందనే భయంతో ఓ మహిళ ఏకంగా డబ్బుని ఓవెన్ లో పెట్టి కాల్చేసింది.!!కరోనా పేరు చెబితే చాలా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఖండాలకు ఖండాల్నే షేక్ చేసేస్తోంది కరోనా వైరస్. చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది.ఈ వైరస్ గాలి ద్వారానే కాక కరోనా సోకిన వారు ముట్టుకున్న వస్తువులను వేరొకరు ముట్టుకున్నా ఈ వైరస్ సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల సెల్ ఫోన్ స్క్రీన్లపై కూడా కరోనా వైరస్ వేరొకరికి సోకుతుందని కూడా చెబుతున్నారు.

ఈ క్రమంలో జియాంగ్యిన్ నగరానికి చెందిన అంట్ లీ అనే మహిళ బ్యాంకు నుంచి డ్రా చేసిన డబ్బులపై వైరస్ ఉండి ఉండొచ్చు అని అనుమానపడింది. అలా అనుమానం వచ్చిందే తడవుగా వాటిని  వేడి చేస్తే వాటిపై కరోనా వైరస్ ఉంటే  చచ్చిపోతుందనే ఉద్దేశంతో రూ.31 వేల యువాన్ (చైనా కరెన్సీ యువాన్) నోట్లను ను మైక్రో‌వేవ్ ఓవెన్‌లో పెట్టి వేడి చేసింది. దీంతో ఆ నోట్లు బాగా వేడెక్కి కాలిపోయాయి. చాలా నోట్లు కాలిపోయాయి. 

కొన్ని మాత్రం ముట్టుకుంటే చిరిగిపోయేంత పెలుసుగా మారాయి. దీంతో ఆమె ఆ డబ్బులను పట్టుకుని పలు బ్యాంకులకు వెళ్లింది. ఎక్కడికి వెళ్లినా.. ఎక్కడా అవి చెల్లవని చెప్పేశారు. దీంతో ఆమెకు మరో ఆలోచన వచ్చింది. దాని గురించి సమాచారాన్ని సేకరించింది. అగ్నిప్రమాదం జరిగినట్లు ఆధారాలు చూపిస్తే ఆ కరెన్సీని మార్చి కొత్త నోట్లు ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. చివరికి.. ఓ బ్యాంకు ఆమె బాధను అర్థం చేసుకుని కాలిన నోట్లను తీసుకొనేందుకు అంగీకరించింది.(కరోనా భయం : ఆవుపేడతో స్నానం!!)

చైనా ముందు చూపు.. వైరస్ సోకకుండా జాగ్రత్తలు
కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ సోకుతుందని ముందే భావించిన చైనా యంత్రంగం బ్యాంకుల్లో ఉన్న వాడేసిన నోట్లన్నింటినీ క్రిమి సంహారకాలతో శుభ్రం చేసింది. అల్ట్రావయోలెట్ లైట్, అత్యధిక ఉష్ణోగ్రతల్లో బ్యాంక్ నోట్లను ఉంచి వైరస్‌ను చంపేసింది. తరువాత 14 రోజులపాటు ఆ నోట్లను సీల్ చేసింది. ఎక్కడైదే ఆర్థిక సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు వాటిని సరఫరా చేస్తూ జాగ్రత్తపడింది. పాత నోట్ల చెలామణిని కూడా నిలిపివేసింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తు వాటినే కొనసాగిస్తోంది. కరోనా వైరస్ కలుషిత వస్తువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే ప్రమాదం ఉందనీ..ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విషయం తెలిసిందే.