కరోనా మరణమృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 1,368 మంది మృతి

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ మరణమృదంగం కొనసాగిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : February 13, 2020 / 04:39 AM IST
కరోనా మరణమృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 1,368 మంది మృతి

Updated On : February 13, 2020 / 4:39 AM IST

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ మరణమృదంగం కొనసాగిస్తోంది.

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ మరణమృదంగం కొనసాగిస్తోంది. ఈ మహమ్మారి బారినపడి అక్కడి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. నిన్న ఒక్కరోజే చైనాలో ఈ రాకాసి వైరస్‌ దెబ్బకు 254మంది మృత్యువాత పడ్డారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 1,368కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 60 వేల 161 మందికి పైగా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడగా.. వీరిలో చైనా వాసులు 59,757మంది ఉన్నారు. ఇందులో 8,243 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోందని  చైనా అంచనా వేస్తున్న సమయంలోనే మృతుల సంఖ్య  ఒక్కసారిగా పెరుగుతోంది. రోజుకు వందలోపే మరణాలు ఉంటే నిన్న ఒక్క రోజే 250మందికి పైగా మరణించడం ఆందోళన కలిగిస్తోంది. నిజానికి మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చన్న కథనాలు వస్తున్నప్పటికీ వాటిపై స్పష్టత మాత్రం లేదు. 

25 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్
చైనాలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే 15వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో పర్యటించని వారికి కూడా కరోనా వైరస్ సోకడాన్ని బట్టి ఇది ఎంత వేగంగా వ్యాప్తిచెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 25 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్… ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమయ్యింది. చైనాలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఓ బృందాన్ని పంపింది. ఎండలు పెరిగితే వైరస్ కాస్త కంట్రోల్‌లోకి వస్తుందని కొందరు అంచనా వేస్తుండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం దానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమంటోంది. 
    
రాత్రింబవళ్లు సేవలు అందిస్తున్న చైనా వైద్య సిబ్బంది
ప్రాణాంతక కరోనా వైరస్‌ను తరిమికొట్టే పోరాటంలో… చైనా వైద్య సిబ్బంది సాహసోపేతంగా పనిచేస్తున్నారు. రాత్రింబవళ్లు ఆస్పత్రుల్లోనే ఉంటూ బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. దేశ పౌరుల్ని కాపాడుకొనేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఇందుకోసం కేవలం తమ సమయాన్ని మాత్రమే త్యాగం చేయడం కాదు.. బాధితులకు వైద్య సేవలందించే క్రమంలో తమ ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా పనిచేస్తూ నిజమైన హీరోలు అని నిరూపించుకుంటున్నారు. తల నుంచి సహజసిద్ధంగా రాలే వెంట్రుకల ద్వారా కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్న అనుమానంతో చైనాలోని నర్సులు తమ శిరోజాలను సైతం తొలగించుకుంచుకొనేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. 

చైనాలోని ఆస్పత్రులకు రోగుల తాకిడి 
చైనాలోని ఆస్పత్రులకు రోగుల తాకిడి రోజురోజుకీ పెరగడంతో వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. నిద్ర కూడా సరిగా లేకపోవడంతో చాలామంది వైద్యులు, నర్సులు ఆస్పత్రిలోని కుర్చీలు, బెంచీల పైనే కాసేపు ఒరిగి సేదతీరుతున్నారు. నిత్యం జనసంచారంతో నిండిపోయి కిటకిటలాడే చైనాలోని పలు నగరాల వీధులన్నీ కరోనా దెబ్బకు బోసిపోయాయి. ఎడారిని తలపించేలా మారాయి. జనం బయటకు వచ్చేందుకే భయపడటంతో రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. అనేక పరిశ్రమలు మూసివేయడంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.