former President Edgar Lungu
former President Edgar Lungu: చనిపోయిన తరువాత పేద వాడైనా, ధనికుడైనా రెండుమూడు రోజుల్లోనే దహన సంస్కారాలను పూర్తిచేస్తారు. ఒక్కోసారి ఆలస్యమైతే.. వారం.. మహా అంటే పదిరోజులు.. కానీ, ఆఫ్రికా దేశమైన జాంబియా మాజీ అధ్యక్షుడు ఎడ్గర్ లుంగూ(68) చనిపోయి 20రోజులు అవుతున్నా ఆయన పార్ధివ దేహానికి ఇంకా అంత్యక్రియలు నిర్వహించలేదు. అయితే.. ఇదంతా అక్కడి ఆచారం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎడ్గర్ లుంగూ భౌతిక కాయానికి అంత్యక్రియలను మేమే నిర్వహించాలి అంటూ ఆయన కుటుంబ సభ్యులు, అక్కడి ప్రభుత్వం వాదులాడుకుంటున్నాయి. దీంతో ఈ అంశం కోర్టుకు సైతం చేరింది.
ఆఫ్రికా దేశమైన జాంబియా దేశానికి పేట్రియాటిక్ ఫ్రంట్ నేత ఎడ్గర్ లుంగూ 2015-2021 మధ్య కాలంలో అధ్యక్షుడిగా పనిచేశారు. జూన్ 5వ తేదీన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అయితే, అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనే విషయంపై వివాదం నెలకొంది.
ఎడ్గర్ లుంగూ బతికిఉన్న సమయంలో తన అంత్యక్రియలకు ప్రస్తుత అధ్యక్షుడు హిచిలేమా హాజరు కాకూడదని చెప్పినట్లు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వ లాంఛనాలతో కాకుండా.. దక్షిణాఫ్రికాలో జోహన్నెస్ బర్గ్‌లోని ఓ ప్రైవేట్ శ్మశాన వాటికలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బింబియా ప్రభుత్వం మాత్రం.. లుంగూ అంత్యక్రియలను ప్రస్తుత అధ్యక్షుడు హిచిలేమా సారథ్యంలోనే అధికారికంగా నిర్వహిస్తామని చెబుతోంది. ఇందుకోసం గతంలో చనిపోయిన అధ్యక్షులను ఖననం చేసిన శ్మశాన వాటికలోనే లుంగూ కోసం సమాధిని సిద్ధం చేశామని ప్రభుత్వం చెప్పింది.
లుంగూ అంత్యక్రియల వివాదం కోర్టుకు చేరడంతో.. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. అయితే, ఆలోపే ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి వస్తే అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చునని సూచించింది. దీంతో కోర్టు తీర్పు వచ్చేవరకు లుంగూ అంత్యక్రియలు ఆగుతాయా.. ఇరువర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చి ఈలోపే అంత్యక్రియలు నిర్వహిస్తారా.. అనే అంశంపై ప్రస్తుతం ఆ దేశంలో చర్చనీయాంశంగా మారింది.