COVID-19 Delta : డేంజర్ డెల్టా… 135 దేశాలకు వ్యాప్తి

కరోనా కొత్త వేరియంట్లలో ‘డెల్టా’ రకం అత్యంత ప్రమాదకరంగా మారింది. వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు డెల్టా వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

Covid 19 Delta

COVID-19 Delta : కరోనా కొత్త వేరియంట్లలో ‘డెల్టా’ రకం అత్యంత ప్రమాదకరంగా మారింది. వేగంగా వ్యాపిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు డెల్టా వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. గత అంచనాలతో పోలిస్తే.. డెల్టా వేరియంట్‌ చాలా ప్రమాదకరంగా మారినట్టు ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా పరిశోధకులు తెలిపారు. ఈ వేరియంట్‌ను కట్టడి చేయాలంటే 80-90 శాతం మంది హెర్డ్‌ ఇమ్యూనిటీ (సామూహికంగా రోగనిరోధక శక్తి) సాధించాల్సిన అవసరముందని చెప్పారు. కరోనా నియంత్రణకు 60-70 శాతం మంది హెర్డ్‌ ఇమ్యూనిటీ సరిపోతుందని ప్రారంభంలో అంచనా వేశామని, అయితే, తమ అంచనాలకు మించి ‘డెల్టా’ వేరియంట్‌ రెట్టింపు వేగంతో వ్యాపిస్తోందన్నారు. 80 నుంచి 90 శాతం హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధిస్తేనే ‘డెల్టా’ వేరియంట్‌ను కట్టడి చేయవచ్చన్నారు. వ్యాక్సినేషన్‌ను అన్ని దేశాలు ముమ్మరం చేయాలని సూచించారు.

తీవ్రత పెరగడానికి కారణం:
ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్‌ మరింత ప్రమాదకరంగా మారడానికి గల కారణాలను చైనా పరిశోధకులు కనుగొన్నారు. బాధితుడి శరీరంలోకి ప్రవేశించిన డెల్టా వేరియంట్‌.. తనలాగే ఉన్న మరో వైరస్‌ను (ఇంకో డెల్టా వేరియంట్‌) అత్యంత స్వల్ప వ్యవధిలో సృష్టిస్తున్నట్టు చైనాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పరిశోధకులు తెలిపారు. కరోనా ప్రారంభంలో సోకిన వైరస్‌ రకంతో పోలిస్తే ‘డెల్టా’ వైరల్‌ లోడ్‌ వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు తెలిపారు. దీంతో ఈ వేరియంట్‌ సులభంగా, అత్యంత వేగంగా వ్యాపిస్తూ.. ప్రమాదకరంగా మారినట్టు వెల్లడించారు.

డెల్టా వేరియంట్‌ ఆగ్నేయాసియా దేశాల్లో కలవరం సృష్టిస్తోంది. వైరస్‌ తొలిసారిగా వెలుగుచూసిన చైనాలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ దేశంలోని 17 ప్రావిన్సుల్లో అధికారులు ఆంక్షలు విధించారు. కేసుల ఉద్ధృతి నేపథ్యంలో ప్రఖ్యాత పర్యాటక నగరం ఝాంగ్‌జియాజీలో లాక్‌డౌన్‌ విధించారు. మరోవైపు, డెల్టా వేరియంట్‌ కారణంగా గత నెలలో వియత్నాం, థాయిలాండ్‌, ఇండోనేషియా, మలేషియా, మయన్మార్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు ఎప్పుడూ నమోదుకాలేదని అధికారులు తెలిపారు. కాగా, రానున్న వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20 కోట్లు దాటొచ్చని డబ్ల్యూహెచ్ వో అంచనా వేసింది.